English   

కరోనా దెబ్బకు టాలీవుడ్ హీరోలు కుదేలు.. 

Tollywood
2020-04-06 08:12:06

ఇండియాకు అనుకోకుండా వచ్చిన రాకాసి అతిథి కరోనా వైరస్. ఎవర్నీ బయటికి రానీకుండా ఇంట్లోనే బంధీని చేసింది ఇది. దీనివల్ల ఇప్పుడు అన్ని రంగాలు కూడా సర్వనాశనం అయిపోతున్నాయి. వేల కోట్ల నష్టాలు వస్తున్నాయి. ఇప్పుడు మన స్టార్ హీరోలకు కూడా ఈ వైరస్ తో భారీగానే నష్టాలు వస్తున్నాయి. అందరి ప్లానింగ్స్ కూడా పూర్తిగా దెబ్బతీసింది కరోనా. చిరంజీవి నుంచి మొదలు పెట్టి చిన్న హీరోల వరకు కూడా ఎవ్వర్నీ వదల్లేదు ఇది. 

ముఖ్యంగా భీష్మ సినిమాతో ఈ ఏడాది హిట్ కొట్టిన నితిన్.. వెంటనే తక్కువ గ్యాప్ లోనే మేలో రంగ్ దే అంటూ వచ్చి హిట్ కొడదామనుకున్నాడు. కానీ ఆయన ఆశలపై ఇప్పుడు కరోనా నీళ్లు చల్లేసింది. ఇక ఎప్రిల్ 2న వద్దామనుకున్న వైష్ణవ్ తేజ్ ఉప్పెన.. అనుష్క నిశ్శబ్ధం కూడా బలైపోయాయి. దానికంటే ముందే వి సినిమా కరోనా దెబ్బకు కుదేలైంది. అలాగే నాని నెక్ట్స్ సినిమా టక్ జగదీష్ రిలీజ్ డేట్ కూడా ఇప్పుడు మారిపోయేలా కనిపిస్తుంది. కరోనా దెబ్బతో పవన్ కళ్యాణ్ కూడా పరేషాన్ అవుతున్నాడు. ఈయన వకీల్ సాబ్ సినిమా మే 15న రావడం కష్టమే ఇప్పుడు. దాంతో పాటు క్రిష్ సినిమాను ఈ ఏడాది విడుదల చేద్దామని ప్లాన్ చేసినా కూడా ఇప్పుడు కరోనా దాన్ని కూడా ఖరాబ్ చేసింది. చిరంజీవి ఆచార్య కూడా ఈ ఏడాది రానట్లే ఇక. 

ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే మరో రెండు నెలల వరకు షూటింగ్స్ ముచ్చటే కనిపించడం లేదు. దాంతో చిరంజీవి ఇంటికే పరిమితం. దాంతో ప్లానింగ్ కూడా నాశనమే. నాగార్జున బంగార్రాజు కూడా కరోనాకు బలైపోయింది. వెంకటేష్ నారప్ప ఇదే ఏడాది సమ్మర్ కానుకగా తీసుకొద్దామనుకుంటే ఇలా అయిపోయింది. బాలయ్య కూడా బోయపాటి సినిమాతో వచ్చి హిట్ కొడదాం అనుకుంటే దుబాయ్ నుంచి వెనక్కి రప్పించింది కరోనా వైరస్. చైతూ లవ్ స్టోరీకి.. అఖిల్ బ్యాచ్ లర్ జిందగీకి కూడా కరోనా గండి పెట్టింది. ఇక నితిన్, నిఖిల్ కు అయితే పెళ్లి ప్లాన్స్ కూడా మార్చుకోక తప్పలేదు. ఈ ఇద్దరూ తాము ప్రేమించిన అమ్మాయిలను త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ ఇప్పుడు కరోనా కారణంగా ఈ ఇద్దరి పెళ్లిళ్లు వాయిదా పడిపోయాయి. 

వినయ విధేయ రామ తర్వాత సినిమాల్లేని రామ్ చరణ్ కు రెండేళ్లు గ్యాప్ వచ్చేలా కనిపిస్తుంది. ఇప్పటికే రాజమౌళి RRR ఆర్నెళ్లు వాయిదా వేసి జనవరి 8 అన్నాడు. ఇప్పుడు ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది. నెక్ట్స్ సినిమా ప్లాన్ కూడా చెడిపోయేలా కనిపిస్తుంది. దాంతో పాటు చిరంజీవి సినిమాలో నటించడానికి టైమ్ కూడా దొరికేలా కనిపించడం లేదు. మరోవైపు ఎన్టీఆర్ కూడా మే లోపు రాజమౌళికి బైబై చెప్పి త్రివిక్రమ్ తో దోస్తానా చేద్దామనుకున్నాడు. కానీ కరోనా జూనియర్ ప్లాన్ అంతా పాడు చేసింది. ప్రభాస్ అయితే యూరప్ వెళ్లి అక్కడ కొన్ని రోజులు ఉండి.. ఇప్పుడు చేసేదేం లేక షూటింగ్ ఆపేసి క్వారెంటైన్ లో ఉన్నాడు. ఇలా ఒక్కరు ఇద్దరు కాదు.. టాలీవుడ్ హీరోల ప్లాన్స్ అందరివి కరోనా వచ్చి కనికరం లేకుండా పాడు చేసింది. 

More Related Stories