గబ్బర్ సింగ్ కా బాప్ చూపిస్తానంటున్న హరీష్ శంకర్..

హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి ఆయనకు సోషల్ మీడియాలో ఒకటే ప్రశ్న వస్తుంది. అన్నా మా పవన్ సినిమా ఎలా ఉండబోతుంది..? మీరు కచ్చితంగా ఈ సారి కూడా గబ్బర్ సింగ్ కంటే పెద్ద సినిమా ఇవ్వాలన్నా అంటూ హరీష్ శంకర్ ను అడుగుతున్నారు పవన్ ఫ్యాన్స్. ఎందుకంటే వాళ్ల ఆకలి ఈ దర్శకుడికి బాగా తెలుసు. అప్పట్లో పవన్ పన్నెండేళ్ళ ఆశలకు తెర దించిన దర్శకుడు ఈయన. గబ్బర్ సింగ్ తో రికార్డులు తిరగరాసిన దర్శకుడు. కానీ ఆ తర్వాతే ఈయనకు చుక్కలు కనిపిస్తున్నాయి. రామయ్యా వస్తావయ్యా ఫ్లాప్.. సుబ్రమణ్యం ఫర్ సేల్ హిట్టైనా అది పెద్ద హీరో సినిమా కాదు. ఆ తర్వాత డిజే, గద్దలకొండ గణేష్ లాంటి సినిమాలతో పర్లేదనిపించాడు ఈ దర్శకుడు.
ఇదంతా ఇలా ఉంటే.. కొన్ని రోజులుగా ఈయన పవన్ కోసం ఈయన ఓ పవర్ ఫుల్ కథ సిద్ధం చేస్తున్నాడు. ఈ సారి వచ్చే సినిమా మాస్ కా బాప్ లా ఉంటుందని.. గబ్బర్ సింగ్ ను కూడా మరిపించేలా ఉంటుందని హామీ ఇస్తున్నాడు హరీష్ శంకర్. పింక్ సినిమా రీమేక్ వకీల్ సాబ్ సినిమాతో పవన్ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రం ఉండగానే క్రిష్ సినిమాను కూడా మొదలుపెట్టాడు. ఈ రెండు సినిమాలను 10 రోజుల గ్యాప్ లోనే మొదలుపెట్టి సంచలనం సృష్టించిన పవన్.. హరీష్ శంకర్ కాంబినేషన్ లో సినిమా చేయబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించింది. గబ్బర్ సింగ్ తర్వాత మరోసారి కాంబినేషన్ రిపీట్ కానుండటంతో పండగ చేసుకుంటున్నారు అభిమానులు. ఈ సినిమాపై మరిన్ని వివరాలు వీలైనంత త్వరగా చెప్పనున్నారు నిర్మాతలు.