రీమేక్ కి రెడీ అయిన శేష్ సినిమా

ఎక్కడో విదేశాలలో మంచి చదువులు చదువుకుని ఉద్యోగం చేయకుండా సినిమాల మీద పిచ్చితో ఇండస్ట్రీకి వచ్చి కర్మ, కిస్ అంటూ సొంత ప్రయత్నాలు చేసి చేతులు కాల్చుకున్నారు అడివి శేష్, ఆ తర్వాత క్షణం, గూఢచారి, ఎవరు సినిమాల హిట్ కొట్టాడని అనుకుంటారు కొందరు. కానీ 2002లో శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన సొంతం సినిమాలో కూడా అడివి శేష్ ఉన్నాడని ఎంత మందికి తెలుసు. అప్పటి నుండి సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కోసం కష్టపడితే ఇప్పటికి మనోడికి లక్ దొరికింది. కిస్, కర్మ అనే సినిమాలు అడివి శేష్ అనేవాడు ఉన్నాడని జనానికి తెలియ చేస్తే క్షణం సినిమా అతనిలో ఒక అద్భుతమైన నటుడు ఉన్నాడని తెలిసేలా చేసింది. ఆ తర్వాత చేసిన గూఢచారి సినిమా శేష్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
తాజాగా ఎవరు సినిమాతో అడివి శేష్ తానేంటో మళ్ళీ నిరూపించాడు. వెంకట్ రాంజీ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో శేష్, రెజీనా, నవీన్ చంద్ర ముఖ్య పాత్రల్లో నటించారు. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులను బాగానే ఎంగేజ్ చేసింది. ఇక ఈ సినిమాని రీమేక్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మధ్య ఒక బాషలో హిట్ అయిన సినిమాని వేరే బాషల వాళ్ళు రీమేక్ చేసే సంప్రదాయం బాగా పెరిగింది. ఈ సినిమాని కూడా కన్నడలో రీమేక్ చేయనున్నట్టు చెబుతున్నారు. ఇక శాండల్ వుడ్ లో కుర్ర నటుడు దిగాంత్ అడివి శేష్ పాత్రలో నటించనున్నాడని అంటున్నారు. మరో ఆసక్తి కర విషయం ఏంటంటే ఎవరు సినిమాకు పని చేసిన టెక్నీషియన్ ఈ రీమేక్ కు కూడా పని చేయనున్నారని అంటున్నారు.