English   

ఆ పార్టీలోకి వెళ్తానంటున్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబు..

mohanpolitics
2020-04-12 10:28:24

మోహన్ బాబుకు రాజకీయాలు కొత్త కాదు. పాతికేళ్ళ క్రితమే ఎన్టీఆర్ బతికి ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఆయన రాజ్యసభకు ఎంపికయ్యాడు. అయితే తనకు రాజకీయ భిక్ష పెట్టిన నందమూరి తారక రామారావు చనిపోయిన తర్వాత పూర్తిగా పాలిటిక్స్ కి దూరంగా జరిగాడు మోహన్ బాబు. అక్కడి నుంచి సినిమాలతో పాటు విద్యావేత్తగా ఎదిగాడు. మధ్యలో వైఎస్ రాజశేఖరరెడ్డి బతికున్నప్పుడు ఆయనతో కొంతకాలం సన్నిహితంగా ఉన్నాడు. ఆ తర్వాత మళ్లీ రాజకీయాలకు అంటీ ముట్టనట్టుగా ఉన్నాడు కలెక్షన్ కింగ్. కానీ గత రెండేళ్లుగా మళ్ళీ మోహన్ బాబు తీరులో మార్పు వచ్చింది. ముఖ్యంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆయన బలంగా కోరుకున్నాడు. సరిగ్గా ఎన్నికలకు ముందు వెళ్లి వైసిపి తీర్థం పుచ్చుకున్నాడు. ఆ పార్టీ నుంచి ఆయనకు రాజ్యసభ సీటు వస్తుందని అందరూ ఊహించారు. కానీ చివరికి అలాంటిదేమీ జరగలేదు. తాను కూడా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు మోహన్ బాబు.

ప్రస్తుతం ఆయన ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రగతి పథంలో నడుస్తోందని చెప్పాడు కలెక్షన్ కింగ్. మరోవైపు దేశ ప్రధాని నరేంద్ర మోడీపై కూడా ప్రశంసల వర్షం కురిపించాడు మోహన్ బాబు. ఆయన లాంటి నాయకుడు మన దేశానికి చాలా అవసరమని.. అలాంటి గొప్ప వ్యక్తి మన దేశానికి ప్రధానిగా ఉండటం మనం చేసుకున్న అదృష్టం అంటున్నాడు. అంతేకాదు మోడీ తనకు మంచి స్నేహితుడని.. తన బడే భాయ్ అని పిలుస్తారు అని చెప్పాడు మోహన్ బాబు. కచ్చితంగా తనకు మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందని అసలు విషయం బయట పెట్టాడు కలెక్షన్ కింగ్. అయితే తాను వైసీపీలో ఉంటానా లేదంటే బీజేపీలోకి వెళ్తామా అనేది కాలమే నిర్ణయిస్తుంది అని చెప్పాడు మోహన్ బాబు. కానీ తనకు జగన్, మోడీ ఇద్దరు ఇష్టమే అని చెప్పాడు ఈయన.

 

More Related Stories