రామ్ డైలమాలో లేడట

కరోనా వల్ల ప్రపంచమే స్థంబించింది. ఇక సినిమాలు ఒక లెక్కా, సినిమా థియేటర్లు సహా షూటింగ్ లు అన్నీ వాయిదా పడ్డాయి. ఇక థియేటర్స్ లేకుంటే రిలీజ్ లు కూడా ఉండవు కదా. ఇప్పుడు అదే పరిస్థితి నెలకొంది. ఆ దెబ్బకి ఈ రెండు నెలల్లో రిలీజ్ కావాల్సిన సినిమాలు మొత్తం వాయిదా పడినట్టే. నిన్న సాయంత్రం మళ్ళీ లాక్ డౌన్ డేట్ కూడా పొడిగించారు. దీంతో ఇక ఈ నెల మొత్తం కొత్త సినిమాలను చూసే అవకాశం లేనట్టే. దీంతో ఒక రకంగా సినిమాలకి సంబందించిన అప్డేట్స్ కూడా లేకుండా పోయాయి. ఏదో ఒకటి రాద్దామని ఒక ఆంగ్ల పత్రిక రామ్ సినిమా రెడ్ ని డిజిటల్ ఫ్లాట్ ఫాంలో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడని ఒకరకంగా ఆ విషయంలో డైలమాలో ఉన్నాడని ఒక కధనాన్ని ప్రచురించింది.
దీంతో రామ్ అభిమాని ఒకరు రామ్ డైలమాలో ఉన్నాడా? ఎంత లేట్ అయిన పర్లేదు అన్నా. సినిమాని థియేటర్లో రిలీజ్ చేయండి. థియేటర్స్‌లో వచ్చే వరకు మేం అదే ప్రేమతో, ఓపికతో ఉంటాం అని ఒక ట్వీట్ వేసి రామ్ ని ట్యాగ్ చేశాడు. ఈ కామెంట్‌కి స్పందించిన రామ్.. "రామ్ డైలమాలో ఏ మాత్రం లేడు. వాస్తవానికి అతను ప్రభుత్వం చెప్పినట్టుగా సోషల్ డిస్టెన్సింగ్, స్వీయ నిర్భంధంలో ఉన్నాడు. అతను కూడా తన ఫ్యాన్స్ అందరు రెడ్ సినిమాని బిగ్ స్క్రీన్‌పైనే చూడాలని కోరుకుంటున్నాడు" అని తన ట్విట్టర్ లో పేర్కొన్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ హీరోగా నివేదా పేతురేజ్, మాళవిక శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా రెడ్ సినిమా తెరకెక్కింది. శ్రవంతి రవి కిశోర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.