మన హీరోలు గ్యాప్ తీసుకోలేదు.. వచ్చిందంతే..

ఏంట్రోయ్ గ్యాప్ ఇచ్చావ్.. ఈ మధ్యే అల వైకుంఠపురములో సినిమాలో బన్నీ కోసం త్రివిక్రమ్ రాసిన డైలాగ్. అప్పుడు ఆయన కావాలని తీసుకోలేదు వచ్చిందంతే. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది మన హీరోల విషయంలో. ఒక్కరో ఇద్దరో కాదు ఇండస్ట్రీ మొత్తానికి గ్యాప్ వచ్చేసిందిప్పుడు. అందరు హీరోలకు కరోనా కలిపి కొట్టేసింది.. అందర్నీ ఇంట్లోనే కుక్కేసింది. ఇప్పట్లో బయటికి రావడం సాధ్యం కాదు.. ఈ ఏడాది పెద్ద సినిమాలు రావడం కూడా అసాధ్యమే. ఒకటో రెండో ఈ ఏడాది రానున్నాయంతే. చిరంజీవి, బాలయ్య, మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇలా చాలా మంది హీరోల సినిమాలు 2020లో ఇకపై విడుదల కానట్లే. చిరంజీవి ఆచార్య అయితే దసరాకు వస్తుందని ఆశలు పెట్టుకున్నారు అభిమానులు.
ఈ కరోనా దెబ్బతో మొత్తం పోయింది. అల్లు అర్జున్ సుకుమార్ పుష్ప సినిమా కూడా ఇదే ఏడాది విడుదల చేయాలనుకున్నాడు. డిసెంబర్ లో తీసుకురావాలని ప్లాన్ చేసాడు కానీ కుదిరేలా లేదు. మహేష్ బాబు కథ అయితే మరీ విడ్డూరంగా ఉంది. ఈయన సరిలేరు నీకెవ్వరు తర్వాత మూడు నెలలు కావాలని గ్యాప్ తీసుకున్నాడు.. ఇప్పుడు కరోనా కూడా మరో రెండు మూడు నెలలు ఇచ్చింది. దాంతో ఈ ఏడాది సరిలేరుతోనే సరిపెట్టుకున్నాడు మహేష్ బాబు. చాలా మంది హీరోల పరిస్థితి కూడా ఇంతే. కాకపోతే కొందరు బయటపడుతున్నారు.. మరికొందరు చెప్పుకోలేకపోతున్నారు. నిర్మాతలు అయితే మరీ దారుణం. పాపం వాళ్ల బాధలు అయితే వర్ణణాతీతమే.