నారప్పను శ్రీకాంత్ అడ్డాల హ్యాండిల్ చేయగలడా..?

ఇప్పుడు అందరికీ ఇదే అనుమానాలు వస్తున్నాయి. అసురన్ లాంటి సినిమాను తీసుకెళ్లి ఈ దర్శకుడి చేతుల్లో పెట్టడం నిజంగానే అందరికీ షాక్. తన కెరీర్ ను సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులా డిజైన్ చేసుకుందాం అనుకున్న శ్రీకాంత్ అడ్డాలకు బ్రహ్మోత్సవం వచ్చి పెద్ద షాకే ఇచ్చింది. ఈ సినిమా తర్వాత ఇప్పటి వరకు ఒక్క ఆఫర్ కూడా రాలేదు. ఒకే ఒక్క సినిమా ఈయన కెరీర్ ను ముంచేయడం కాదు.. కనిపించకుండా చేసింది. అదే బ్రహ్మోత్సవం. ఈ సినిమాలో మంచి మరీ ఎక్కువైపోయి డిజాస్టర్ అయిపోయింది. ఆ తర్వాత కనిపించడమే మానేసాడు. ఆ మధ్య డిజే ఆడియో వేడుకలో తన సంస్థలో పని చేసిన దర్శకులందర్నీ ఒకే చోట చేర్చాడు దిల్ రాజు. అప్పుడు చూసిందే ఈ దర్శకున్ని.. మళ్లీ ఇప్పటి వరకు బయట కనబడలేదు. బ్రహ్మోత్సవం ఇచ్చిన షాక్ తో ఈయన వైపు చూడ్డానికి కూడా నిర్మాతలు సాహసించడం లేదు. ఒక్కటి రెండు కాదు.. ఏకంగా 35 కోట్లకు పైగా నష్టాలు తీసుకురావడంతో శ్రీకాంత్ అడ్డాలపై నమ్మకాలన్నీ పోయాయి.
బ్రహ్మోత్సవం తర్వాత ఇన్నాళ్లకు వెంకటేష్ హీరోగా తమిళ సినిమా అసురన్ ను తెలుగులో రీమేక్ చేసే అవకాశం అందుకున్నాడు శ్రీకాంత్ అడ్డాల. ఈ సినిమా షూటింగ్ కూడా సగానికి పైగా పూర్తయింది. కరోనా కారణంగా ఆగిపోయింది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ చూసిన తర్వాత సినిమాను తెలుగులో ఈయన హ్యాండిల్ చేస్తాడా అనే అనుమానాలు వస్తున్నాయి. నారప్ప అనే టైటిల్ తో అసురన్ రీమేక్ రూపొందుతుంది. వెంకటేష్ కూడా బాగానే సెట్ అయ్యాడు. అయితే ఈ సినిమాను అంత అద్భుతంగా తెలుగులో శ్రీకాంత్ అడ్డాల తీయగలడా అనేది ఇక్కడ ప్రశ్న. దీని కోసం ఎలాంటి పారితోషికం తీసుకోకుండా పనిచేస్తున్నాడు శ్రీకాంత్ అడ్డాల. విడుదలైన తర్వాత పారితోషకం ఇస్తామని నిర్మాతలు చెప్పినట్లు తెలుస్తోంది. అసురన్ లాంటి సినిమాకు శ్రీకాంత్ అడ్డాల సరైన దర్శకుడు కాదు అంటూ ఇండస్ట్రీలో ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. మరి వెంకటేష్ చేస్తున్న ఈ ప్రయోగం ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.