ఎన్టీఆర్, అట్లీ కాంబినేషన్ కలుపుతున్న మెగా ప్రొడ్యూసర్..

అట్లీ కుమార్ అంటే ఇప్పుడు దక్షిణాదిన తెలియని వాళ్లుండరేమో..? సినిమాలతో కాస్త పరిచయం ఉన్న వాళ్లకు ఈయన సృష్టించిన సంచలనాలు కచ్చితంగా గుర్తుంటాయి. రెండేళ్ల కింద మెర్సల్ సినిమాతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నాడు అట్లీ కుమార్. మెడికల్ మాఫియాకు తోడు జిఎస్టీ ఇష్యూపై కూడా ప్రశ్నించి ఔరా అనిపించాడు అట్లీకుమార్. దానికి ముందే తెరీ.. రాజారాణి లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు అట్లీ. మొన్నటికి మొన్న విజయ్ హీరోగా వచ్చిన విజిల్ సినిమా కూడా మంచి విజయమే సాధించింది. బిగిల్ పేరుతో వచ్చిన ఈ చిత్రం తమిళనాట 300 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ఈ కుర్ర దర్శకుడి కోసం స్టార్ హీరోలు కూడా వేచి చూస్తున్నారు. ఇలాంటి టైమ్ లో తాను తెలుగులో సినిమా చేస్తున్నానంటూ ఆ మధ్య అనౌన్స్ చేసాడు అట్లీ.
ఎన్టీఆర్ తోనే ఈయన సినిమా ఉంటుందని వార్తలు వినిపించాయి. విజిల్ ప్రీ రిలీజ్ వేడుకలో కూడా ఇదే విషయం చెప్పాడు అట్లీ. తనకు ఎన్టీఆర్ అంటే ఇష్టమని.. కచ్చితంగా సినిమా చేస్తానని చెప్పాడు. ఈయన దర్శకత్వంలో అశ్వినీదత్ సినిమా కూడా అనౌన్స్ చేసాడు. అట్లీ కుమార్ ను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యత ఈయనే తీసుకుంటున్నాడు. ఎన్టీఆర్ హీరోగా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. మరో ఏడాది వరకు ఎన్టీఆర్ బిజి. ఆర్ఆర్ఆర్ తర్వాత త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నాడు జూనియర్. ఆ తర్వాత అట్లీ సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతుంది. అట్లీ కుమార్ చూపులు తెలుగు ఇండస్ట్రీపై పడాలంటే మరో ఏడాది అయినా ఆగాల్సిందే..! కానీ ఎప్పుడొచ్చిన అట్లీ సినిమా ఎన్టీఆర్ తోనే ఉంటుందనేది మాత్రం వినిపిస్తున్న మాట.