English   

యమలీల టెలివిజన్ పై వర్కవుట్ అవుతుందా..

yamaleela
2020-04-17 07:40:29

అప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్ గా ఉన్న అలీని ఒక్కసారిగా స్టార్ చేసిన సినిమా యమలీల. అప్పటికే రాజేంద్రుడు-గజేంద్రుడు, మాయలోడు లాంటి సెన్సేషనల్ సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్న ఎస్.వి.కృష్ణారెడ్డి ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా తర్వాత దాదాపు 50 సినిమాల్లో అలీ హీరోగా నటించాడు. అందులో ఘటోత్కచుడు లాంటి ఒకటి రెండు సినిమాలు తప్పిస్తే ఈయన విజయం అందుకున్నది లేదు. అయితే యమలీల సినిమా మాత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. కొన్ని థియేటర్లలో ఏడాది పాటు ఆడింది. కామెడీ ఎంటర్టైన్మెంట్ కు కన్నీళ్లు పెట్టించే మదర్ సెంటిమెంట్ జోడించి యమలీల సినిమా తెరకెక్కించాడు ఎస్ వి కృష్ణారెడ్డి. ఇప్పుడు యమలీల టీవీలో రాబోతుంది.

అది కూడా సీరియల్ రూపంలో.. ఇందులో కూడా కమెడియన్ అలీ నటిస్తున్నాడు. యమలీలలో ఈయనకు తల్లిగా నటించిన మంజు భార్గవి ఇందులో కూడా నటిస్తుంది. ఈటీవీలో ఈ సీరియల్ త్వరలోనే ప్రసారం కాబోతుంది. యమలీల వెండితెరపై వర్కవుట్ అయినట్లు బుల్లితెరపై కూడా విజయం సాధిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. అలాంటి లెజెండరీ సినిమాను ముట్టుకోవడం నిజంగా సాహసం. ఇప్పటికే యమలీల 2 పేరుతో సీక్వెల్ పేరుతో ఎస్.వి.కృష్ణారెడ్డి చేతులు కాల్చుకున్నాడు. అలాంటివి సీరియల్ రూపంలో యమలీల రాబోతుంది. మరి ఇది ఎంత వరకు ప్రేక్షకులను అలరిస్తుందనేది చూడాలి. ఇందులో కూడా పూర్తిగా మదర్ సెంటిమెంట్ కనిపిస్తుంది. ప్రస్తుతం విడుదలైన ప్రోమోలు బాగానే ఆకట్టుకుంటున్నాయి. ఒక్కసారి లాడ్ డౌన్ అయిపోయిన తర్వాత యమలీల ప్రసారం కానుంది. ఇందులో యముడిగా సీనియర్ హీరో సుమన్ నటిస్తున్నాడు.

More Related Stories