ఆచార్యలో మహేష్.. కొరటాల చెప్పిన సంచలన నిజాలు..

మేం అసలు మహేష్ బాబు గురించి ఆలోచించలేదు.. అసలు ఆ పేరు ఎలా బయటికి వచ్చిందో తెలియదు అంటూ అప్పట్లో ఆచార్య సినిమా గురించి చెప్పుకొచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. తన సినిమాలో ముందు నుంచి కూడా రామ్ చరణ్ నే అనుకుంటున్నట్లు చిరు చెప్పాడు. అయితే ఇఫ్పుడు అసలు విషయాలన్నీ కొరటాల చెప్పాడు. ఈ సినిమాలో చరణ్ పాత్ర కోసం మహేష్ బాబును కూడా అడిగినట్లు ఒప్పుకున్నాడు ఈ దర్శకుడు. ఓ బాధ్యత కలిగిన యువకుడి పాత్ర కోసం చరణ్ ని అనుకుంటున్నానని చిరంజీవి తనతో చెప్పాడని.. ఇదే విషయాన్ని చరణ్ కు చెప్పిన తర్వాత ఆయన కూడా ఓకే అన్నాడని చెప్పాడు కొరటాల. కానీ రాజమౌళి సినిమా చేస్తున్న చరణ్.. తనకు డేట్స్ ఇవ్వాలంటే చాలా కాలం పడుతుందని అర్థమైపోయిందని..
అలాంటిప్పుడు తనకు టెన్షన్ పెరిగిపోయి ఇదే కథను మహేష్ బాబుకు కూడా చెప్పినట్లు చెప్పాడు. దానికి ఆయన సినిమా విడుదల ఎప్పుడని అడిగాడని.. కానీ దానికి కూడా తన దగ్గర సమాధానం లేదని చెప్పాడు కొరటాల. అయినా కూడా మీరేం టెన్షన్ పడకండి.. దానికి నేనున్నానని చెప్పడం తనకు చాలా ధైర్యాన్నిచ్చిందని చెప్పాడు. అలాంటి సూపర్ స్టార్ తనకు మాటివ్వడం.. అలా అనడం షాకిచ్చిందని చెప్పాడు ఈయన. ఈ విషయాన్ని తాను కొందరితో పంచుకున్నానని.. అయితే అది ఎలా బయటికి వచ్చిందో తెలియదని చెప్పాడు కొరటాల శివ. అలా ఆచార్యలో మహేష్ బాబు నటిస్తున్నాడంటూ ప్రచారం జరిగిందని అసలు విషయం చెప్పాడు కొరటాల