English   

సిల్క్ స్మిత మరణించే ముందు రోజు ఏం జరిగింది..?

slik
2020-04-28 07:26:34

సిల్క్ స్మిత మరణం ఇప్పటికీ మిస్టరీనే. ఆమె ఎందుకు చనిపోయింది.. అంత అవసరం ఏమొచ్చింది.. ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాల్సిన గత్యంతర పరిస్థితులు ఏమొచ్చాయి అనేది ఈరోజుకు కూడా మిస్టరీనే. సిల్క్ స్మిత మరణం మాత్రం చాలా మందికి గుణపాఠం. కెరీర్ లో ఎలా ఎదగాలి.. ఎలా సంపాదించాలి అనేదాంతో పాటు ఎలా ముగించకూడదు.. ఎలా ఉండకూడదు అనేది కూడా సిల్క్ ను చూసి నేర్చుకోవాల్సిందే. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీతో పాటు దక్షిణాదిని ఊపేసిన ఈ నటి.. వందల సినిమాల్లో నటించి ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నటి అర్ధాంతరంగా చిన్న వయసులోనే తనువు చాలించింది. 20 ఏళ్ళ వయసు కంటే ముందే వచ్చి తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది స్మిత. ఒకప్పుడు స్టార్ హీరోలు కూడా ఈమె డేట్స్ కోసం వేచి చూసేవాళ్లంటే ఆమె రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. మహానగరానికి మరదలు పిల్ల అంటూ ఈమెకు ఇమేజ్ ఉంది. ఈమె బయోపిక్ కూడా వచ్చింది.. అదే డర్టీ పిక్చర్. అది కూడా సంచలన విజయం సాధించింది. కెరీర్ పీక్స్ చూసి అంతేవేగంగా పడిపోయింది స్మిత.

ఎన్నో వందల సినిమాలు చేసిన ఈమె చావు కూడా అంతే మిస్టరీగా మారిపోయింది. ఎన్నో కోట్లమంది అభిమానుల హృదయాలను గాయపరుస్తూ చిన్న వయసులోనే తనువు చాలించింది సిల్క్. ఆత్మహత్య చేసుకోవడం వెనక ఉన్న కారణాలు మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆమె స్నేహితుడు, తోటి నటుడు, కన్నడ సూపర్ స్టార్ రవిచంద్రన్ ఈమె మరణం వెనక ఉన్న కొన్ని సంచలన నిజాలు బయటపెట్టాడు. 1992లో సిల్క్ స్మిత, రవిచంద్రన్ కలిసి హల్లి మేస్త్రు అనే సినిమాలో నటించారు. అప్పట్నుంచే వీళ్ల స్నేహం బలపడింది. ఆమె చనిపోయే ముందు రోజు వరకూ సిల్క్ స్మిత చాలా స్నేహంగా ఉండేదని తెలిపాడు రవిచంద్రన్. స్మిత తనతో ఎంతో గౌరవంగా ఉండేదని.. అలాగే తానూ ఆమె పట్ల గౌరవంగా ఉండేవాడినని చెప్పాడు రవి. ఈమె చనిపోయే ఒక్కరోజు ముందు తనకు ఫోన్ చేసిందని చెప్పాడు రవిచంద్రన్.

తనను కలవాలని ప్రయత్నించిందేమో కానీ.. అది సాధ్యం కాలేదని గుర్తు చేసుకున్నాడు ఈ కన్నడ నటుడు. కానీ ఆ సమయంలో తాను ఓ షూటింగ్‌లో ఉన్నందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయానని చెప్పాడు రవి. అదేదో రొటీన్ కాల్ అనుకున్నానని.. అందుకే పెద్దగా రిప్లై కూడా ఇవ్వలేదని చెప్పాడు రవిచంద్రన్. 1996 సంవత్సరం సెప్టెంబర్ 23న సిల్క్ స్మిత తనకు కాల్ చేసిందని.. కానీ తాను మాట్లాడలేకపోయానని.. కానీ ఆ తర్వాత రోజే ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు రవిచంద్రన్. ఆ రోజు తాను నిజంగానే ఫోన్ లిఫ్ట్ చేసుంటే కచ్చితంగా పరిస్థితి మరోలా ఉండేదని.. ఆమె కష్టాలు తనకు చెప్పుకునేదేమో అని బాధ పడ్డాడు రవిచంద్రన్. ఆమె చనిపోవడం తనకు ఎప్పటికీ గుర్తుండిపోయే చేదు జ్ఞాపకం అని చెప్పాడు రవి. ఆయన చెప్పాడని కాదు కానీ సిల్క్ స్మిత మరణం ఇప్పటికీ మిస్టరీనే. ఒకవేళ నిజంగానే రవిచంద్రన్ ఆ రోజు ఫోన్ ఎత్తుంటే పరిస్థితి ఎలా ఉండేదో మరి..? అయినా ఇప్పుడు అనుకుని కూడా లాభం లేదు. కర్ణుడి చావుకు లక్ష కారణాలన్నట్లు సిల్క్ మరణం వెనక కూడా చాలా కారణాలున్నాయి. అందులో ఆర్థిక ఇబ్బందులు మొదటి కారణం అంటారు కొందరు. మరికొందరు మాత్రం చెడు అలవాట్లే ఆమె ప్రాణాన్ని తీసాయంటారు. కారణమేదైనా కూడా ఓ స్టార్ చిన్న వయసులోనే నేలకొరిగింది.

More Related Stories