సూర్యకి తమిళ నిర్మాతల మద్దతు

నటుడు సూర్యకి తమిళనాడు థియేటర్స్ యజమానుల సంఘం షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఆయనకు దాదాపు 30 మంది తమిళ నిర్మాతలు మద్దతుగా నిలిచారు. నిజానికి 2డీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద జ్యోతిక హీరోయిన్ గా సూర్య నిర్మించిన చిత్రం 'పోన్ మగల్ వందల్'. అయితే లాక్డౌన్ నేపథ్యంలో ఈ సినిమాను నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయనున్నామని ప్రకటించారు. ఈ ప్రకటనతో తమిళ్ ఇండస్ట్రీలో వివాదం మొదలైంది. సూర్యను భయపెట్టేందుకు సూర్య నిర్మించే సినిమాల్ని ఇక తమ థియేటర్ ప్రదర్శించమని, నిషేధిస్తున్నామని యజమానులు ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో తమిళ పరిశ్రమకు చెందిన 30 మంది ప్రముఖ నిర్మాతలు సూర్యకు అండగా నిలిచారు. పరిస్థితుల్ని బట్టి చిన్న సినిమాల్ని ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో విడుదల చేయడం సరైన నిర్ణయమేనని వారు సూర్య నిర్ణయాన్ని వెనకేసుకొచ్చారు.
ఈ ట్రెండ్ వల్ల చిన్న సినిమాల నిర్మాతకు ఆ పెట్టుబడి వెంటనే తిరిగి వస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు నిన్న ఒక ప్రకటన విడుదల చేశారు. టెక్నాలజీ అభివృద్ధి చెందిన నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా తీసిన అనేక కొత్త సినిమాలు నేరుగా ఓటీటీ లోకి వస్తున్నాయని కరోనా లాక్డౌన్ విధించడంతో చిన్న, మధ్య తరహా బడ్జెట్ సినిమాల హక్కుల్ని ఓటీటీ ఫ్లాట్‌ఫాంలు సొంతం చేసుకుంటున్నాయని వారు ప్ర్కొన్నారు. ఇలానే మున్ముందు కూడా చిన్న, మధ్య తరహా సినిమాల్ని కొనుగోలు చేసుకోవాలని ఓటీటీ ప్లేయర్స్‌ను మేం కోరుతామని వారు చెప్పుకొచ్చారు. తాను నిర్మించిన సినిమాల్ని ఏ ఫ్లాట్‌ఫాంలో విడుదల చేయాలనేది నిర్మాత ఇష్టమని ఆ విషయంలో నిర్మాతకు పూర్తి స్వేచ్ఛ ఉందని వారు పేర్కొన్నారు.