English   

అల్లు అర్జున్ గీత గోవిందం అందుకే వదిలేసాడంట.. 

Allu Arjun
2020-04-28 15:21:57

ఇండస్ట్రీలో ఓ హీరో కోసం రాసుకున్న కథలు మరో హీరోకు వెళ్లడం కామన్. అలాగే విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన గీత గోవిందం సినిమా కూడా ముందు అల్లు అర్జున్ కోసం రాసుకున్నాడు దర్శకుడు పరశురామ్. దానికి ముందే శిరీష్ కు శ్రీరస్తు శుభమస్తు లాంటి హిట్ ఇవ్వడంతో అల్లు అరవింద్ కూడా ఈ దర్శకుడిని బాగానే నమ్మాడు. ఆ నమ్మకంతోనే బన్నీ కోసం కథ సిద్ధం చేసాడు పరశురామ్. అదే నమ్మకంతో వెళ్లి అల్లు అర్జున్ కు చెప్పడం.. ఆ కథ బాగా నచ్చడం కూడా జరిగిపోయాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే గీత గోవిందం పట్టాలెక్కడానికి సిద్ధమైపోయింది. కానీ చివరి నిమిషంలో బన్నీ మనసు మార్చుకున్నాడు. దాంతో సినిమాలో హీరో మారిపోయాడు. 

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా వచ్చిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. కేవలం 16 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా దాదాపు 70 కోట్ల షేర్ తీసుకొచ్చి తెలుగు ఇండస్ట్రీలోనే అత్యధిక లాభాలు తీసుకొచ్చిన సినిమాల్లో ఒకటిగా రికార్డులు సృష్టించింది. ఈ సినిమాతో అల్లు అరవింద్ దాదాపు 50 కోట్లకు పైగా లాభాలు తీసుకొచ్చింది. సరైనోడు లాంటి మాస్ సినిమా తర్వాత ఇంత సున్నితమైన లవ్ స్టోరీ చేస్తే తేడా కొడుతుందని బన్నీ గీత గోవిందం సినిమాను వదిలేసుకున్నాడు. అదే విజయ్ దేవరకొండకు వరమైంది. పెళ్లి చూపులు లాంటి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న విజయ్‌ అయితే బాగుంటాడని అల్లు అరవింద్ అనుకోవడం.. ఆయన్నే తీసుకోవడం జరిగిపోయాయి. అయితే షూటింగ్ మొదలైన కొన్ని రోజులకు అర్జున్ రెడ్డి రిలీజ్ అవ్వడం.. విజయ్ ఇమేజ్ మారిపోవడంతో అల్లు అరవింద్ భయపడినా కూడా దర్శకుడు పరశురామ్ మాత్రం విజయ్ దేవరకొండపై నమ్మకంగా ఉన్నాడు. చివరికి ఆయన నమ్మకమే నిజమైంది.

More Related Stories