English   

త్రివిక్రమ్‌తో చిరంజీవికి గొడవైందా.. గురూజీ సినిమా ఏది..

Trivikram Chiranjeevi
2020-04-28 17:47:06

చిరంజీవి ఎన్ని సినిమాలు చేస్తున్నాడనేది ప్రస్తుతం సగటు సినిమా ప్రేక్షకుడికి వస్తున్న అనుమానం. పదేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన అన్నయ్య అన్నేళ్ల గ్యాప్ మొత్తాన్ని ఇఫ్పుడు కవర్ చేస్తున్నాడు. ప్రస్తుతం కొరటాల శివతో ఆచార్య సినిమా చేస్తున్నాడు చిరు. ఇది పూర్తి కాగానే మరో మూడు సినిమాలు లైన్ లో పెట్టేసాడు. సుజీత్ దర్శకత్వంలో లూసీఫర్ తెలుగు రీమేక్ చేయబోతున్నాడు మెగాస్టార్. ఈ సినిమా తర్వాత బాబీ ఉన్నాడు.. ఆ తర్వాత హరీష్ శంకర్, మెహర్ రమేష్ లాంటి దర్శకులు ఉన్నారు. ఇంతమంది పేర్లు చెప్పిన చిరంజీవి.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు మాత్రం చెప్పలేదు. వినయ విధేయ రామ సినిమా ఆడియో వేడుకలో తను త్వరలోనే త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేసాడు మెగాస్టార్. 

తమ కాంబినేషన్ కలిపింది రామ్ చరణ్ అంటూ అభిమానుల ముందు అసలు విషయం చెప్పాడు చిరంజీవి. అందుకే తనయుడికి థాంక్స్ కూడా చెప్పాడు చిరు. తనకు మంచి దర్శకున్ని త‌న‌యుడు ఇచ్చాడ‌ని మురిసిపోయాడు ఈ హీరో. 2020 చివర్లో త్రివిక్రమ్- చిరంజీవి సినిమా ప‌ట్టాలెక్కే అవకాశం ఉందనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే గురూజీతో చిరంజీవి సినిమా లేనట్లే కనిపిస్తుంది. అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్ తర్వాత ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా కోసం కథ సిద్ధం చేస్తున్నాడు త్రివిక్రమ్. ఆ తర్వాత చిరంజీవి సినిమా ఉంటుందేమో అనుకుంటే అది కూడా కుదిరేలా కనిపించడం లేదు. గతంలో మెగాస్టార్ నటించిన జై చిరంజీవ సినిమాకు కథ, మాటలు అందించాడు మాటల మాంత్రికుడు. పరిస్థితులు చూస్తుంటే చిరు, త్రివిక్రమ్ మధ్య ఏదైనా మాటల యుద్ధం జరిగిందా అనేది కూడా అర్థం కావడం లేదు. మరి చూడాలిక.. చిరు, త్రివిక్రమ్ ఎప్పుడు కలిసి పని చేస్తారో..? 

More Related Stories