English   

టాలీవుడ్‌పై లాక్‌డౌన్ ప్రభావం వివరించిన సురేష్ బాబు..

sureshbabu
2020-04-28 19:46:23

కరోనా వైరస్ ప్రభావం తెలుగు ఇండస్ట్రీపై చాలా దారుణంగా పడింది. ఇప్పటికే వేల కోట్ల నష్టాలు వచ్చాయి. అసలు మళ్లీ తిరిగి ఇండస్ట్రీ పుంజుకోడానికి ఎన్ని రోజులు పడుతుందో కూడా అర్థం కావడం లేదు. అంతగా దారుణమైన స్థితిలోకి వెళ్లిపోయింది టాలీవుడ్. ఈ సందర్భంలో సీనియర్ నిర్మాత సురేష్ బాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేాసడు. ఈయన మాట్లాడుతూ.. 'లాక్‌డౌన్‌ తర్వాత ఇండస్ట్రీని నెమ్మదిగా మొదలుపెడతాం.. ఎందుకంటే సోషల్ డిస్టేన్సింగ్ లో షూటింగ్‌ జరపడం సాధ్యం కాదు.. థియేటర్‌లో కూడా సామాజిక దూరం పాటించి.. సినిమాలు చూస్తే మంచి అనుభూతిని ఇవ్వలేకపోవచ్చు. మెల్లగా మార్పులు జరుగుతాయి. ఎలా తిరిగి షూటింగ్‌ చేయాలి? ఎలా జనాల్ని థియేటర్‌కు రప్పించాలి? అనే విషయాలు ఆలోచించాలి. 20-30 మందితో కలిసి చిన్న, మీడియం సినిమాల షూటింగ్‌ చేయడం మొదలుపెడతాం. ఇన్‌డోర్‌, అవుట్‌డోర్‌లో పరిమిత వ్యక్తులతో చిన్న సినిమాలు తీస్తాం. వీలుంటే ముందుగా వాటిని ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో విడుదల చేస్తాం అంటూ చెప్పుకొచ్చాడు సురేష్ బాబు.

ఈయన తాజాగా ఓ ఛానెల్ కు వీడియో కాల్ లో ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులోనే చాలా విషయాలు చెప్పుకొచ్చాడు.
'లాక్‌డౌన్‌ ప్రభావం అందరికంటే ఎక్కువగా డిస్ట్రిబ్యూటర్లపైనే పడింది.. డిజిటల్‌ పరంగా మేం ఏం చేయగలమో అన్నీ చేస్తాం. ఎవరైనా సరే మార్పుల్ని అంగీకరించాలి. ఇండస్ట్రీ మారితేనే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇన్నాళ్లూ ఓ విధంగా బతికాం.. ఇప్పుడు మారాల్సి పరిస్థితి వచ్చింది. నాకు మరో సంవత్సరం వరకు పెద్దగా పనులు లేవు. ఈ సమయంలో నన్ను నేను భవిష్యత్తు కోసం రెడీ చేసుకుంటున్నా. ఇంట్లో ఉండీ ఉండీ అందరికీ విసుగొచ్చేసింది. కరోనా ఇకలేదు.. అని రేపు ప్రకటించినా అందరూ థియేటర్లు, మాల్స్‌, పబ్‌లకు గుంపులు గుంపులుగా వెళ్లిపోతారు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఆప్షన్‌ వస్తే థియేటర్లకు ఇంకా డిమాండ్‌ పెరుగుతుంది. భయం వెళ్లిపోయిన తర్వాత మాత్రమే అందరూ థియేటర్లకు వస్తారు. అప్పటి వరకు పరిస్థితి ఇలానే ఉంటుంది. ఈ సీజన్‌లో అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌ డిమాండ్ బాగా పెరిగింది. కొందరు తమ సినిమాల్ని వీటిలో విడుదల చేయొచ్చు. మరికొందరు థియేటర్లు ప్రారంభం అయ్యే వరకూ ఎదురుచూడొచ్చు. ఇప్పటికే తమిళంలో జ్యోతిక సినిమా విడుదలకు సిద్ధమైంది.

దానిపై వివాదం జరుగుతోంది. హిందీలోనూ సినిమాలు విడుదల అవుతున్నాయి. విజయ్‌ సినిమాకు 150 కోట్లు ఖర్చు అయిందని తెలుస్తుంది.. అదే బడ్జెట్‌ ఓటీటీ ఫ్లాట్‌ఫాం ఇస్తే.. వారికి ఇవ్వడానికి దర్శక, నిర్మాతలు సిద్ధంగానే ఉంటారేమో. అది సినిమా తీసే వారి ఇష్టం' అని చెప్పాడు సురేష్ బాబు.'హోమ్‌ క్వారంటైన్‌లో వ్యాయామం చేస్తున్నా. కుటుంబ సభ్యులతో ముచ్చట్లు చెప్పుకొంటూ కొత్త పనులు నేర్చుకుంటున్నా. రానా, అభి ఏదో చెబుతుంటారు వింటుంటాను.. వాళ్లతోనే ఎక్కువ సమయం గడిచిపోతోంది. స్నేహితుల గ్రూపుల్లో ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. 'నష్టపోతున్నాం, మళ్లీ ఎప్పుడు కోలుకోవాలి' అంటూ మాట్లాడుతున్నారు. ఇలాంటి రోజుల్ని కథల్లో ఊహించాం కానీ.. నిజంగా వస్తాయి అనుకోలేదు. కరోనా తర్వాత మనం కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాం. దానికి సిద్ధంగా ఉండాలి. నేనైతే పాజిటివ్‌గా ఉన్నా. నా రోగనిరోధకశక్తి పెంచుకోవడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నా. ఒత్తిడి పెట్టుకుని సాధించేది ఏమీ లేదు. మా వీధిలో ఎవరైనా నడుస్తున్నా.. తిడుతున్నా' అంటూ చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చాడు సురేష్ బాబు.

 

More Related Stories