English   

అమృతరామమ్ రివ్యూ

 Amrutharamam Review
2020-04-29 21:38:49

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎవరూ చేయని సాహసం చేసారు అమృతరామమ్ దర్శక నిర్మాతలు. ఈ సినిమాను నేరుగా డిజిటల్‌లో విడుదల చేసి సంచలనం సృష్టించారు. చాలాసార్లు విడుదల తేదీ వాయిదా పడిన ఈ చిత్రం ఇప్పుడు నేరుగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. జీ5లో అమృతరామమ్ విడుదలైంది. ఈ సినిమా చూసిన తర్వాత ఓటిటిలో ఎందుకు విడుదల చేసారో అర్థమైపోతుంది. థియేటర్లో విడుదల చేస్తే కనీసం వచ్చే డబ్బులు కూడా రావని ముందుగానే దర్శక నిర్మాతలకు అర్థమైపోయుంటుందని సినిమా చూసిన ఆడియన్స్ కూడా సెటైర్లు వేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా రెండు కారెక్టర్స్ మధ్య మాత్రమే ఉంటుంది.. అదే అమృత అండ్ రామ్. 

కథ:

హీరోయిన్‌ అమృత‌(అమిత రంగ‌నాథ్‌) చదువు కోసం ఫారెన్ వెళ్తుంది. అక్కడ తనను రిసీవ్ చేసుకోడానికి వచ్చిన రామ్‌(రామ్ మిట్ట‌కంటి)ను చూసి తొలి చూపులోనే ప్రేమ‌లో పడిపోతుంది. అది పిచ్చి ప్రేమ‌గా మారుతుంది. ఎంత‌లా అంటే అత‌నితో ఎవ‌రు స‌న్నిహితంగా మెలిగినా భ‌రించ‌లేనంత‌గా.. తన ప్రేమ మొత్తం ఆమెకు సొంతం కావాలి అనేంతగా. ఈ క్రమంలోనే తనకు మాత్రమే సొంతం కావాలనుకున్న రమ్ నుంచి కొన్ని దూరం చేసేందుకు విశ్వ‌ ప్ర‌య‌త్నాలు చేస్తుంది. దీంతో అత‌ని అహం దెబ్బ‌తిని గొడ‌వ మొద‌లవుతుంది. అది కాస్తా తారాస్థాయికి చేర‌డంతో ఆమెతో విడిపోవ‌డానికి సిద్ధ‌మవుతాడు. కాళ్లా వేళ్లా ప‌డ్డా క‌నిక‌రించ‌డు. కానీ స్నేహితుడి ద్వారా అవ‌న్నీ తన ప్రేమ కోసమే చేసింద‌ని తెలుసుకుని త‌న‌ను వెతుక్కుంటూ వెళ‌తాడు. ఆ త‌ర్వాత అనుకోకుండా హీరోకు యాక్సిడెంట్ అవుతుంది.. అతడు చనిపోయే పరిస్థితుల్లో ఉన్నపుడు హీరోయిన్ తన గుండెను ఇచ్చి హీరోను కాపాడుకుంటుంది.. అలా అతడి గుండెలో హీరోయిన్ బతికే ఉందని దర్శకుడు చూపించాడు. 

కథనం:

దాదాపు 20 ఏళ్ల కిందే ప్రేయసి రావే లాంటి సినిమాల్లోనే గుండెలు తీసి పెట్టే ప్రేమకథలు తెలుగు ప్రేక్షకులు చూసారు. ఇప్పుడు 2020 నడుస్తుంది.. ఇప్పుడు కూడా ఇలాంటి ప్రేమకథలు అంటే కాస్త నవ్వు వస్తుంది. అయితే ఎమోషనల్ గా డీల్ చేస్తే ఎప్పుడైనా ఇలాంటి కథలకు డిమాండ్ ఉంటుంది. కానీ దర్శకుడు సురేందర్ మాత్రం ఈ విషయంలో పూర్తిగా విఫలమయ్యాడు. సినిమా మొత్తం అమెరికా బ్యాక్‌డ్రాప్‌లో కొన‌సాగుతుంది. ల‌వ్ ఎట్ ఫ‌స్ట్ సైట్ ప్రేమికుల‌కు న‌చ్చుతుంది. ద‌ర్శ‌కుడు క‌థ‌ను న‌డిపించిన విధానంలో పెద్ద‌గా ట్విస్టులు కూడా ఉండ‌వు.  ఫ‌స్టాఫ్ ఆస‌క్తిక‌రంగా అనిపించ‌దు.. మరీ భారంగా.. నెమ్మదిగా సాగుతుంది. ఫస్టాఫ్ ఎలాగోలా నెట్టుకురాగా సెకండాఫ్ మాత్రం కాస్త పర్లేదు అనిపించారు కానీ క్లైమాక్స్ అంతా తేలిపోయింది. దర్శకుడు చాలా చోట్ల తడబడిన విషయం స్పష్టంగా అర్థమైపోయింది. దీంతో స‌గ‌టు ప్రేక్ష‌కుడు అస్సలు ఈ సినిమాతో కనెక్ట్ అవ్వలేడు. పైగా ఈ సినిమా అక్కడక్కడా ఏ మాయ చేసావేకు జిరాక్స్ కాపీగా అనిపిస్తుంది. హీరోయిన్ ను హీరో అపార్థం చేసుకోవడం.. ఆ తర్వాత అర్థం చేసుకుని వస్తుంటే యాక్సిడెంట్ కావడం అనేది పాతదైపోయింది. మళ్లీ అదే కథను పట్టుకుని దర్శకుడు సురేందర్ ఈ సినిమా చేసాడు. 

నటీనటులు:

హీరో రామ్ మిట్టకంటి పర్లేదు.. హీరోయిన్ అమితా రంగనాథ్ మాత్రం అద్భుతంగా నటించింది. పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. మిగిలిన వాళ్లంతా పెద్దగా పరిచయం లేకపోవడం కూడా సినిమాకు మైనస్. ఫస్ట్ తెలుగు డిజిటల్ రిలీజ్ అంటూ నానా హంగామా చేసిన అమృతరామమ్ థియేటర్ లో కానీ ఈ సినిమా తెచ్చుంటే ఒక్కరోజు కూడా ఆడేది కాదేమో..? ఇలాంటి సినిమాలే మళ్లీ మళ్లీ డైరెక్ట్ ఓటిటి రిలీజ్ అయితే చూసే ప్రేక్షకులు కూడా చూడరు.

Rating: 2/5

More Related Stories