చిరంజీవి అడుగులు జనసేన వైపు పడుతున్నాయా..

పైకి కనిపించరు కానీ మెగా కుటుంబం మాత్రం చాలా ముదుర్లు. వాళ్లు సినిమాల్లోనే కాదు.. బయట కూడా అర్థం కారు. అంతా దూరంగా ఉన్నట్టే ఉంటారు.. ఎవరి దారి వాళ్లదే అన్నట్లుంటారు. కానీ సమయం వచ్చినపుడు అంతా ఒక్కటే అంటారు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. అసలు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో పాటు మెగా కుటుంబం నడుస్తుందా నడవదా..? అన్నయ్య ఇప్పుడు రాజకీయాల్లో లేడు. అందుకే తమ్ముడి దగ్గరికి వస్తాడా రాడా అనే అనుమానం చాలా మందిలో ఉంది. అయితే పవన్ ఒంటరిగానే వస్తాడు.. అన్నయ్య అండదండలు తీసుకోడు అనేది ఇన్నాళ్లూ బలంగా వినిపించిన మాట.. ఇప్పటికీ ఇదే మాట వినిపిస్తోంది కూడా. కానీ ఇప్పుడు అన్నీ మారిపోతున్నాయి. అన్నీ కుదిరితే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి చిరంజీవి అండదండలు పుష్కలంగా ఉండే అవకాశం కనిపిస్తోంది.
ఇప్పటికీ పవర్ స్టార్ ఆలోచన ఇదే. చిరు వస్తే తన పార్టీ మరో ప్రజారాజ్యం అయిపోతుందనే అనే భయం కూడా పవన్ కళ్యాణ్ లో ఉంది. అయితే ఇప్పుడు తీరు చూస్తుంటే మెగా కుటుంబం అంతా కలిసికట్టుగా ఇప్పుడు జనసేన వెంట నడిచేలా కనిపిస్తుంది. అన్నయ్య కూడా ఆప్యాయంగా తమ్ముడు చేస్తున్న పోరాటానికి సపోర్ట్ చేస్తున్నాడు. ఓడిపోయినంత మాత్రాన ఏది ఆగిపోలేదని ఇప్పుడు కాకపోతే కష్టపడే వాడికి తర్వాత విజయం వస్తుంది అంటున్నాడు చిరంజీవి. ఈ రోజు కాకపోతే రేపు కచ్చితంగా తమ్ముడు అనుకున్నది సాధిస్తాడని చెబుతున్నాడు మెగాస్టార్.
పైగా బాబాయ్ అడగాలే కానీ ఏం చేయడానికి అయినా తాను సిద్ధమే అని ఇదివరకే చెప్పాడు రామ్ చరణ్. ఇక చిరు కూడా కోరితే ఇప్పుడు కాకపోయినా మరో ఐదేళ్ల తర్వాత తన తమ్ముడు పార్టీ కోసం పని చేస్తారేమో అనే వార్తలు వినిపిస్తున్నాయి. మెగా కుటుంబంలో ఎప్పుడు అనుబంధాలు ఎలా తిరుగుతాయో తెలియదు కాబట్టి అప్పటి వరకు ఏదైనా జరగవచ్చు అని అభిమానులు కూడా ఆశతో ఉన్నారు. ఒకవేళ అన్నా తమ్ముడు కలిసి పనిచేస్తే పార్టీపై ప్రభావం ఎలా ఉంటుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది.
సెకండ్ గ్రేడ్ లీడర్ లేకుండా.. సరైన క్యాడర్ లేకుండా ఎలక్షన్ బరిలోకి దిగాడు పవన్. దాని వల్ల ఫలితం ఎలా ఉంటుందో ఇప్పటికే జనసేనానికి అర్థం అయింది. దాంతో తాజాగా మెగా అభిమానుల సపోర్ట్ కూడా తీసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. మూడున్నర దశాబ్ధాలుగా చిరు అభిమాన సంఘంలో ఉన్న కొందరు అభిమానులు ఇప్పుడు పవన్ జనసేనలో చేరబోతున్నారు. చిరు అభిమాన సంఘం అధ్యక్షుడు స్వామి నాయుడుతో పాటు మరి కొందరు జనసేనలో జాయిన్ కాబోతున్నారు. అయితే ఇది చిరంజీవి వ్యూహమా.. లేదంటే అన్నయ్య సినిమాల్లో ఉన్నాడు కాబట్టి రాజకీయంగా తమ్ముడికి సపోర్ట్ చేయాలని అభిమానులు సొంతంగా తీసుకున్న నిర్ణయమా అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.