English   

బాలీవుడ్ దిగ్గజాలకు ఎలాంటి దుస్థితి వచ్చింది పాపం..

bollywood
2020-05-01 08:35:02

ఇండియన్ సినిమాలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దిగ్గజ నటులు ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్  వరస రోజుల్లో మరణించడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇద్దరు నటులు కేవలం 24 గంటల వ్యవధిలో కన్నుమూయడంతో ఇండియన్ సినిమాలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. వీళ్లు చనిపోయిన దానికంటే కూడా వీళ్ళ అంత్యక్రియలు జరిగిన తీరు అభిమానులను మరింత కలచివేస్తుంది. సాధారణ పరిస్థితులు ఉంటే ముంబై వీధులన్నీ ఈ నటుల అంతిమయాత్రతో కిక్కిరిసిపోయేవి. కోట్లాదిమంది అభిమానుల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న ఇద్దరు లెజెండరీ నటులు.. అంత్యక్రియల విషయంలో మాత్రం ఘన నివాళి అందుకోలేకపోయారు. ఈ మాయదారి కరోనా వైరస్ లేకపోయి ఉంటే దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు ఎంతో మంది స్టార్స్ వాళ్ళను కడసారి చూసుకోవడానికి వెళ్ళేవారు. అలాగే లక్షల్లో అభిమానులు వచ్చేవాళ్ళు. కానీ కరోనా వైరస్ ప్రబలంగా వ్యాపిస్తున్న తరుణంలో తమ వాళ్లను చూడటానికి ఎవరూ రావద్దు అంటూ కుటుంబ సభ్యులు విషణ్ణ వదనంతో అభిమానులకు ఆత్మీయులకు విజ్ఞప్తి చేశారు.

దయచేసి ఎవరి ఇళ్లలో వారే ఉండి నివాళి అర్పించాల్సిందిగా వాళ్ళు కోరారు. అందుకే ఏప్రిల్ 29 మధ్యాహ్నం 12 గంటలకు ఇర్ఫాన్ చనిపోతే ఆయన పార్థివ దేహాన్ని అటు నుంచి అటే వెర్సోవ కబ్రిస్తాన్ స్మశాన వాటికకు తరలించి సాయంత్రం 3 గంటలకు నిరాడంబరంగా అంత్యక్రియలు జరిపారు. రిషి కపూర్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఏప్రిల్ 30 ఉదయం 8 గంటల 45 నిమిషాలకు ఈయన కన్నుమూస్తే సాయంత్రం 4 గంటలకు ముంబై చందన్ వాడీ స్మశాన ఘాట్లో ఆయన అంత్యక్రియలు జరిగాయి. కేవలం కుటుంబ సభ్యులు బంధువులు సన్నిహితులు మాత్రమే ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అంతటి గొప్ప నటులకు ఇలాంటి దుస్థితి రావడం అభిమానులతో పాటు అందరినీ కలిచి వేస్తున్న విషయం.

More Related Stories