English   

మంత్రి కేటీఆర్‌కు ప్రకాష్ రాజ్ ప్రత్యేక కృతజ్ఞతలు..

ktr
2020-05-07 07:14:30

కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్ లో వలస కూలీలు చాలా కష్టాలు పడ్డారు.. కొందరు అయితే ఏకంగా ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. కరోనా కంటే దారుణంగా ఆకలి చావులు కూడా చూసాం. అయితే ఇన్ని రోజులు కూడా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎంతో మంది వలస కూలీలను ఆదుకుంది. వారికి ఆశ్రయాలను ఏర్పాటు చేసి పొట్ట నింపింది. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా వలస కూలీలను ఆదుకున్నాయి.. వాళ్ల కడుపులు నింపాయి. ఇందులో ప్రకాష్ రాజ్ ఫౌండేషన్ కూడా ఉంది. చాలా మంది వలస కూలీలకు ప్రకాష్ రాజ్ తన ఫామ్ హౌస్‌లో ఆశ్రయం ఇచ్చారు. గత 44 రోజులుగా వాళ్లకు ఆశ్రయం అందించాడు.. మూడు పూటలా భోజనం పెట్టాడు. వాళ్ల ఆలనా పాలనా చూసుకున్నాడు. దీనికోసం ఇండస్ట్రీ నుంచి కూడా తనకు సాయం అందిందని చెప్పాడు ఈయన. ఇదిలా ఉంటే వలస కూలీలను వాళ్ళ స్వస్థలాలకు పంపడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఇందులో హైదరాబాద్ తో పాటు వరంగల్, ఖమ్మం, రామగుండం, దామరచర్ల తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు నడపుతున్నారు.

బీహార్, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలకు రోజుకు 40 చొప్పున ప్రత్యేక రైళ్లను నడుపుతూ వలస కార్మికులను తరలిస్తున్నారు. దీంతో ప్రకాష్ రాజ్ ఫామ్ హౌస్‌లో ఉంటున్న వలస కార్మికులు కూడా తమ స్వస్థలాలకు బయలుదేరారు. ఈ విషయాన్ని ప్రకాష్ రాజ్ స్వయంగా తన ట్విట్టర్ లో వెల్లడించాడు. ఈ ఏర్పాటు చేసినందుకు కేటీఆర్ తో పాటు డిజిపికి కూడా థ్యాంక్స్ చెప్పాడు ప్రకాష్ రాజ్. 44 రోజుల పాటు వారికి తన వ్యవసాయ క్షేత్రంలో ఆశ్రయం ఇచ్చానని.. వాళ్లందరూ ఇప్పుడు తనను వదిలిపెట్టి వెళ్లిపోతున్నారని.. వారి జీవిత కథల నుంచి నేను ఎంతో నేర్చుకున్నానని చెప్పాడు ప్రకాష్ రాజ్. కష్టకాలంలో వారిని ఆదుకోగలిగిన ఒక తోటి వ్యక్తిగా నేను ఎంతో గర్వపడుతున్నాను. వాళ్లకు ఆశ్రయం ఇవ్వడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపాడు ప్రకాష్ రాజ్.

 

More Related Stories