తన బయోగ్రఫీతో వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్న డైరెక్టర్

హీరోహీరోయిన్లతోపాటు.. కుర్ర దర్శకులు కూడా వెబ్ సిరీస్లోకి అడుగుపెడుతున్నారు. ఓ సీనియర్ డైరెక్టర్ వెబ్ సిరీస్ వైపు మొగ్గు చూపిస్తున్నాడు. అయితే ఈ వెబ్ సిరీస్ డైరెక్టర్ జీవిత చరిత్ర కావడం విశేషం. ఇంతకీ వెబ్ సిరీస్లోకి ఎంట్రీ ఇస్తున్నా ఆ సీనియర్ డైరెక్టర్ ఎవరు అనుకుంటున్నారా ? ఆయనే వంశీ. నిజానికి ఒకరకంగా మనకి ఈ పేరు వినపడగానే మదిలో గోదారి మెదులుతుంది. అంతగా గోదావరి యాస, అక్కడి అందాలు వెండి తెర మీద ఆవిష్కరించారాయన. ఇప్పుడు దానిని మెయిన్ గా ఫోకస్ చేస్తూ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఈమద్య కాలంలో వెబ్ సిరీస్ లు లెక్కకు మించి నిర్మితం అవుతున్నాయి. ఒక్క సిరీస్ సక్సెస్ కావడం ఆలస్యం ఎంతనే వాటికి సీక్వెల్స్ అంటూ వరుసగా సిరీస్ లు వస్తున్నాయి.
మొన్నటి వరకు ఇతర దేశాలకే పరిమితం అయిన వెబ్ సిరీస్ లు గత కొంత కాలంగా ఇండియాలో కూడా విస్తరిస్తున్నాయి. వెబ్ సిరీస్ లను కూడా సినిమాల స్థాయిలో సినిమా నటీనటులను, టెక్నీషియన్స్ ని పెట్టి మరీ తీస్తున్నారు. నిజానికి సినిమాలకు అయితే కొన్ని పరిమితులు, సెన్సార్ లాంటి కండీషన్స్ ఉంటాయి. వెబ్ సిరీస్ లకు అలాంటివి ఏమీ లేని కారణంగా చాలా మంది వెబ్ సిరీస్ లపై ఆసక్తి చూపుతున్నారు. వంశీ తన వ్యక్తిగత జీవితం, సినిమా జీవితానికి సంబంధించి ఓ పుస్తకం రాస్తున్నారు. ఈ విషయం తెలిసిన ఓ నిర్మాణ సంస్థ పుస్తకం కంటే ముందు వంశీ జీవిత కథను వెబ్ సిరీస్ గా రూపొందించేందుకు గాను ఆయనతో సంప్రదింపులు జరిపిందని టాక్. వంశీ కూడా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.