మహానటికి రెండేళ్లు.. ఎన్నో రికార్డులు.. మరెన్నో రివార్డులు..

చనిపోయిన తర్వాత సావిత్రిని ఎవరూ పట్టించుకోలేదు.. బతికున్నపుడు చివరి రోజుల్లో కూడా వదిలేసారు. కానీ ఇప్పుడు ఆమె చనిపోయిన 39 ఏళ్ళ తర్వాత మళ్లీ ఆ మహానటి గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. దానికి కారణం ఆమె బయోపిక్ మహానటి. ఇదంతా నాగ్ అశ్విన్ ప్రతిభే. 30 ఏళ్ల వయసులోనే ఆ మహానటిపై సినిమా చేసి అందరికీ ఆమె ఏంటో మరోసారి పరిచయం చేసాడు అశ్విన్. కలెక్షన్ల విషయంలోనూ మహానటి తన సత్తా చూపించింది. ఒకటి రెండు కాదు.. 43 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి నిర్మాతల పంట పండించింది. ఏడేళ్లుగా ఒక్క హిట్ కూడా లేని వై జయంతి బ్యానర్ కు పునర్వైభవం తీసుకొచ్చింది మహానటి. ఈ సినిమా వచ్చి అప్పుడే రెండేళ్లు అయిపోయింది. మే 9, 2018న విడుదలైంది మహానటి. మార్నింగ్ షో నుంచే ఈ చిత్రానికి అద్భుతమైన టాక్ వచ్చింది. సినిమాకు బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు.
మహానటి జీవితాన్ని చూడ్డానికి ఎప్పుడూ థియేటర్స్ కు రాని ఆడియన్స్ కూడా వచ్చారు. చిన్నాపెద్దా ముసలి మతకా అనే తేడా లేకుండా అంతా మహానటికి నీరాజనాలు పట్టి సంచలన విజయం అందించారు. మహానటికి మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రఖ్యాత ఇండియన్ బాక్సాఫీస్ సంస్థ IMDB ప్రకటించిన ఇండియన్ టాప్ 10 సినిమాల్లో మహానటికి నాలుగో స్థానం దక్కింది. ఇది నిజంగా అరుదైన విషయమే. ఎందుకంటే ఇందులో బాలీవుడ్ సినిమాలకే ఎక్కువగా ప్రాధాన్యం ఉంటుంది. కానీ వాటిని తట్టుకుని మరి మహానటి నిలబడింది. ఆ మధ్య ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ కు కూడా ఇండియా నుంచి మహానటి ఎంపికైంది. అది కూడా ఉత్తమ చిత్రం.. నటి.. సహాయనటి కేటగిరీల్లో. ఇప్పుడు మరోసారి ఇలాంటి ఘనతే సాధించింది. మొత్తానికి మహానటి విడుదలై రెండేళ్లు గడిచినా కూడా ఇప్పటికీ రికార్డులు మాత్రం ఆగడం లేదు.