English   

కరోనా వైరస్‌ను టార్గెట్ చేసిన సంపూర్ణేష్ బాబు..

 Sampoornesh Babu
2020-05-09 16:31:25

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ పై దండయాత్ర చేయడానికి సిద్ధమయ్యాడు సంపూర్ణేష్ బాబు. తెలుగులో పేరడీలు చేయాలంటే అందరికంటే ముందుంటాడు ఈయన. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు. కరోనా వైరస్ నేపథ్యంలో సంపూ సినిమా చేస్తున్నాడు. మే9 న ఈయన పుట్టిన రోజు. దాంతో ఈయన కొత్త సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. హృదయ కాలేయం చిత్రంతో బర్నింగ్ స్టార్‌గా మారిన సంపూ గతేడాది కొబ్బరి మట్టతో అలరించాడు. ఇందులో మూడు విభిన్న పాత్రలలో కనిపించి మెప్పించాడు. ఇప్పుడు మెడికల్ హార్రర్ తో వస్తున్నాడు. సంపూర్ణేష్ బర్త్‌ డే సందర్భంగా ఆయన చిత్రానికి సంబంధించిన కొన్ని పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హృదయ కాలేయం, కొబ్బరి మట్ట తెరకెక్కించిన వాళ్లే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు వూహాన్ గబ్బిలాల మార్కెట్‌లో చిత్రీకరించిన చివరి సినిమా ఇదే అని టీం ప్రమోట్ చేస్తున్నారు. ఇదంతా ఉత్తిదే అని తెలుసు కానీ అలా ప్రమోషన్స్ తో హైప్ తెచ్చుకుంటున్నారు దర్శక నిర్మాతలు. నొలన్ మౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం విదేశాల్లో అత్యంత భారీ బడ్జెట్‌తో ,ఒళ్ళు గగుర్పొడిచే గ్రాఫిక్స్ తో రూపొందినట్టు సంపూ చెప్పాడు. చిత్ర టైటిల్ ఏంటనేది సర్‌ప్రైజింగ్‌గా ఉంచారు. చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. చైనాలోని వుహాన్ నగరంలో సముద్ర జీవులను అమ్మే మార్కెట్ నేపథ్యంలో కరోనా మహమ్మారి పుట్టినట్టు ప్రచారం జరుగుతన్న సంగతి తెలిసిందే. మరి ఆ మార్కెట్ పై సంపూ చేస్తున్న ఈ పేరడీ చిత్రం ఎలా ఉంటుందో చూడాలిక. 

More Related Stories