నా పిల్లలకు జన్మనివ్వబోయే తల్లి.. నయనతారపై విఘ్నేష్ ట్వీట్..

ఇన్నాళ్లూ కొన్ని అనుమానాలు ఉండేవి.. విఘ్నేష్ శివన్ తో కూడా నయనతార బ్రేకప్ చెప్పేసిందని.. ఇద్దరూ విడిపోయారని.. కలిసి ఉండటం లేదని. కానీ అవన్నీ అబద్ధాలే అని ఒకే ఒక్క ట్వీట్ తో తేల్చేసాడు ఈ దర్శకుడు. ఇప్పటికీ తాను నయనతారతోనే ప్రేమలో ఉన్నానని చెప్పకనే చెప్పేసాడు. మదర్స్ డే సందర్భంగా ఈయన చేసిన ట్వీట్ సంచలనం అవుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఓ పాపను ఎత్తుకుని ఉన్న నయనతార ఫోటోను ట్వీట్ చేసాడు విఘ్నేష్ శివన్. మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు.
అయితే అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. తమ బంధంపై బహిరంగంగా ఇప్పుడు ట్వీట్ చేసాడు ఈయన. ఓ పాపను ఎత్తుకున్న నయన్ ఫొటోను పోస్ట్ చేసి.. నా పిల్లలకు జన్మినివ్వబోయే తల్లి చేతుల్లో ఉన్న పాప తల్లికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు అని కామెంట్ చేసాడు. దీన్నిబట్టి విఘ్నేష్, నయన్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే విషయం అర్థమైపోతుంది. లేదంటే సహజీవనం చేసినా కూడా ఇద్దరూ తల్లిదండ్రులు అవుతారనే విషయం కూడా కన్ఫర్మ్ అయిపోయింది. తన తల్లితో పాటు నయనతార తల్లికి కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు విఘ్నేష్. నా పిల్లలకు కాబోయే తల్లి అనేది చిన్న మాట కాదు.. ఈ ఒక్కమాటతోనే అందరి అనుమానాలకు తెర దించేసాడు విఘ్నేష్.