English   

అప్పుడు సీతమ్మ వాకిట్లో.. ఇప్పుడు కూచుపూడి వారి వీధి..

srikanth
2020-05-11 19:43:29

ఒక్క సినిమా చాలు క‌దా.. కెరీర్ ముంచ‌డానికి. ఇప్పుడు శ్రీ‌కాంత్ అడ్డాల‌ను చూస్తుంటే ఇది నిజ‌మే అనిపిస్తుంది. ఈయ‌న కెరీర్ ఇప్పుడు ఎటూ కాకుండా ఉంది. ఒకే ఒక్క సినిమా ఈయ‌న కెరీర్ ను ముంచేయ‌డం కాదు.. క‌నిపించ‌కుండా చేసింది. అదే బ్ర‌హ్మోత్స‌వం. ఈ సినిమాలో మంచి మ‌రీ ఎక్కువైపోయి డిజాస్ట‌ర్ అయిపోయింది. ఆ త‌ర్వాత క‌నిపించ‌డ‌మే మానేసాడు. ప్రస్తుతం ఈయన వెంకటేష్ హీరోగా వస్తున్న నారప్ప సినిమా తెరకెక్కిస్తున్నాడు. అసురన్ సినిమాకు రీమేక్ ఇది. బ్ర‌హ్మోత్స‌వం ఇచ్చిన షాక్ తో ఈయ‌న వైపు చూడ్డానికి కూడా నిర్మాత‌లు సాహ‌సించ‌డం లేదు. ఒక్క‌టి రెండు కాదు.. ఏకంగా 35 కోట్ల‌కు పైగా న‌ష్టాలు తీసుకురావ‌డంతో శ్రీ‌కాంత్ అడ్డాల‌పై న‌మ్మ‌కాల‌న్నీ పోయాయి.

బ్ర‌హ్మోత్స‌వం త‌ర్వాత మ‌నోడు మరో సినిమా కోసం మూడేళ్లు ఆగాల్సి వచ్చింది. ప్రస్తుతం వెంకటేష్ నారప్ప కూడా పూర్తిగా రీమేక్ సబ్జెక్ట్. ఎలాంటి ప్రయోగాలకు కూడా తావు లేదు.. కాపీ పేస్ట్ చేసేయడమే. ఇదిలా ఉంటే నారప్ప సినిమాను కూడా రెమ్యునరేషన్ లేకుండా చేస్తున్నాడు శ్రీకాంత్ అడ్డాల. ఈ సినిమా తర్వాత మరో కథ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాడు ఈ దర్శకుడు. శ‌ర్వానంద్  హీరోగానే గీతాఆర్ట్స్ లో సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతుంది. దీనికి కూచుపూడి వారి వీధి అనే టైటిల్ కూడా అనుకుంటున్నాడు శ్రీ‌కాంత్ అడ్డాల. సీతమ్మ వాకిట్లో తరహాలో సాగే పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. దీనిపై త్వ‌ర‌లోనే కీల‌క స‌మాచారం బ‌య‌టికి రానుంది. అప్ప‌టి వ‌ర‌కు ఈ మంచి ద‌ర్శ‌కుడికి ఎదురు చూపులు త‌ప్ప‌వు.

More Related Stories