రానాకు కూడా పెళ్లి అయిపోతుంది.. ప్రభాస్ సంగతి ఏంటి..

ఇప్పుడు ఇవే అనుమానాలు అందరిలోనూ కలుగుతున్నాయి. ఇన్ని రోజులు ప్రభాస్ కు తోడుగా రానా కూడా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆయన కూడా పెళ్లి చేసుకుంటున్నాడు. చాలా రోజుల నుంచి నడిపిస్తున్న ప్రేమకథను ఈ రోజు బయట పెట్టాడు దగ్గుబాటి వారసుడు. తన కాబోయే భార్యను అందరికి పరిచయం చేశాడు. దాంతో ఇప్పుడు ప్రభాస్ ఒక్కడే పెళ్లి కాకుండా మిగిలిపోయాడు. ప్రభాస్ పెళ్లిపై ఇప్పట్నుంచి కాదు.. కొన్నేళ్లుగా మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. రోజుకో రకంగా.. విధంగా ప్రభాస్ పెళ్లి అంటూ రాస్తుంటారు. కానీ ఎప్పుడూ ఈయన నోరు తెరించింది లేదు.. మాట్లాడింది లేదు. ఎప్పుడు అడిగినా కూడా ఇప్పుడు కాదు తర్వాతంటూ ఓ స్త్రీ రేపు రా తరహాలో సమాధానం చెప్తుంటాడు ప్రభాస్. కానీ ఎందుకో తెలియదు మరి ఇప్పుడు ప్రభాస్ తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చాడు. పెళ్లి అనేది చెప్పి చేసుకునేదే కానీ నాలుగు గోడల మధ్య ఉంచుకునేది కాదంటూ గట్టిగానే చెప్పాడు యంగ్ రెబల్ స్టార్.
ఈయన పెళ్లి ఖాయమైందని.. ఇదే ఏడాది పెళ్లి జరగబోతుందని ఈ మధ్య వార్తలు బానే పుట్టుకొచ్చాయి. మరికొందరైతే అనుష్కనే పెళ్లి చేసుకుంటున్నాడంటూ రాసుకొచ్చారు. అయితే ఇవేవీ నిజం కాదని తేల్చేసాడు ప్రభాస్. తాను అనుష్క మంచి స్నేహితులు మాత్రమే అని క్లారిటీ ఇచ్చాడు ప్రభాస్. తాను ప్రస్తుతం కెరీర్ పైనే దృష్టి పెట్టానని.. పెళ్లి చేసుకుంటే చెప్పే చేసుకుంటా కంగారు పడకండి అంటూ మీడియాకు కూడా చిన్న సెటైర్ వేసాడు. ప్రస్తుతం ఈయన రాధా కృష్ణ కుమార్ సినిమాతో పాటు నాగ్ అశ్విన్ సినిమాకు కమిట్ అయ్యాడు. రాధాకృష్ణ తెరకెక్కిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయింది. ఇది పూర్తైన అయినా ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడేమో అని అభిమానులు ఆశిస్తున్నారు. కానీ ఈయన మాత్రం కచ్చితంగా పెళ్లి చేసుకుంటా కానీ ఎప్పుడో తెలియందంటున్నాడు. మొత్తానికి ప్రభాస్ పెళ్లి అనేది ఎప్పటికీ తేలని లెక్కలా మారిపోయిందిప్పుడు. మరి ఆ లెక్క తేల్చే అమ్మాయి ఎక్కడుందో ఏమో..?