English   

జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్.. తాతకు తగ్గ మనవడు..

ntr
2020-05-20 06:51:15

నందమూరి వంశం.. మూడు తరాల చరిత్ర.. ఇంట్లోనే మహానటుడు.. బాబాయ్ మాస్ హీరో.. తండ్రి కూడా మంచి నటుడు.. ఇంతటి బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చి అంచనాలు నిలబెట్టుకోవడం అంటే చిన్న విషయం కాదు. అది చేతకాకే అదే కుటుంబం నుంచి వచ్చిన కొందరు హీరోలు ఇప్పటికీ స్టార్స్ కాలేకపోతున్నారు. కానీ అందరి అంచనాలు నిలబెట్టి తాతకు తగ్గ మనవడు.. బాబాయ్‌కు తగ్గ అబ్బాయి అని నిరూపించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. 1983, మే 20న జన్మించాడు ఈయన. నేటితో సరిగ్గా 37 వసంతాలు పూర్తి చేసుకుని 38వ వడిలోకి అడుగు పెట్టాడు జూనియర్. చిన్ననాటి నుంచే సినిమా కుటుంబంలో పెరగడంతో నటన వైపు ఆసక్తి చూపించాడు ఎన్టీఆర్. అయితే చిన్నపుడు మాత్రం చాలా అల్లరి పిల్లోడే. అమ్మ శాలిని ఈయన తుంటరి వేషాలు తట్టుకోలేక హాస్టల్‌లో వేసింది కూడా.

అక్కడ కూడా చేతులు, కాళ్లు కొరికేసి మరీ వచ్చేంత చిలిపితనం తారక్ సొంతం. స్నేహమంటే ప్రాణమిస్తాడు. తనకంటే వయసులో పెద్ద వాళ్లతోనే ఎక్కువగా స్నేహం చేస్తాడు ఈయన. సినిమాల్లోకి కూడా నూనూగు మీసాల వయసులోనే వచ్చాడు. ఇంకా చెప్పాలంటే సరిగ్గా మీసం కూడా రాని వయసులోనే బాల రామాయణంతో 1997లో ప్రేక్షకుల ముందుకొచ్చాడు ఈయన. ఆ తర్వాత నాలుగేళ్లకు నిన్ను చూడాలని అంటూ సోలో హీరోగా పరిచయం అయ్యాడు. అచ్చంగా తాతలాగే ఉన్నాడే అనే పేరు తెచ్చుకున్నాడు. ఇక స్టూడెంట్ నెం 1 సినిమాతో సంచలన విజయం సాధించి నేనున్నాను అని గుర్తు చేసాడు. వెంటనే ఫ్లాప్స్ వచ్చినా కూడా 2002లో వచ్చిన ఆది సినిమాతో ఇండస్ట్రీ రికార్డులకు చెక్ పెట్టాడు. 19 ఏళ్ల వయసులోనే సంచలన విజయం అందుకున్నాడు.

ఆ మరుసటి ఏడాది రాజమౌళి తెరకెక్కించిన సింహాద్రి సినిమా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ను మార్చేసింది. 20 ఏళ్ల వయసులోనే రికార్డులన్నీ తన పేర రాసుకున్నాడు. మాస్ హీరోగా చక్రం తిప్పడం మొదలు పెట్టాడు. కానీ వయసుకు మించిన ఇమేజ్ రావడంతో నాలుగేళ్ల పాటు నానా యాతన పడ్డాడు ఎన్టీఆర్. సాంబ, రాఖీ లాంటి సినిమాలు యావరేజ్ అనిపించాయే కానీ కోరుకున్న విజయం మాత్రం రాలేదు. అలాంటి సమయంలో 2007లో మళ్లీ రాజమౌళి వచ్చి యమదొంగతో విజయం అందించాడు. అక్కడ్నుంచి మళ్లీ గాడిన పడిన ఎన్టీఆర్.. కంత్రితో ఫ్లాప్ ఇచ్చాడు. కానీ వెంటనే అదుర్స్, బృందావనం, బాద్షా లాంటి సినిమాలతో సత్తా చూపించాడు.
మధ్యలో ఫ్లాపులు వచ్చినా కూడా టెంపర్ నుంచి తనకంటూ కొత్త పంథా క్రియేట్ చేసుకున్నాడు. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత లాంటి సినిమాలతో వరస విజయాలతో దున్నేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం రాజమౌళితో రామ్ చరణ్ హీరోగా ట్రిపుల్ ఆర్ అనే మల్టీస్టారర్ చేస్తున్నాడు జూనియర్. తర్వాత త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్ లాంటి దర్శకులు లైన్‌లో ఉన్నారు. ఇన్నేళ్ల తన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు చూసాడు తారక్. వయసుకు మించిన పనులు చాలానే చేసాడు. మధ్యలో రాజకీయాల రుచి కూడా చూసాడు. నాన్న పోయిన తర్వాత అన్నకు అన్నీ తానే అయ్యాడు. ఇలా ఎన్నో చేసాడు.. ఇంకా చేస్తూనే ఉన్నాడు. ప్రతీ విషయంలోనూ తాత పేరు నిలబెడుతూ ముందుకెళ్తున్నాడు. ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీని కూడా నడిపిస్తాడని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.

 

More Related Stories