సుకుమార్ అసిస్టెంట్ తో హీరో నాని సినిమా...

హీరో నాని కొత్త ట్యాలెంట్ ని ప్రోత్సహించే పనిలో పడ్డట్టు ఉన్నారు. ఇప్పటి దాకా పెద్దగా కొత్త దర్శకులతో పని చేయని నాని ఈసారి ఒక కొత్త డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. నిజానికి ఆయన కొత్త దర్శకులకి నిర్మాతగా రెండు సార్లు చాన్స్ ఇచ్చాడు. ఒకరి ప్రశాంత్ వర్మ, రెండు శైలేష్ కొలను. ఇక గత ఏడాది ‘జెర్సీ’, ‘గ్యాంగ్‌లీడర్’ చిత్రాలతో రెండు సినిమాల హిట్స్ అందుకున్నాడు నాని. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన వి సినిమా ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రావలసి ఉంది. కరోనా దెబ్బకు అది వాయిదా పడింది. ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కిన ఈ చిత్రంలో ఆయన నెగటివ్ రోల్ లో దర్శనమివ్వబోతున్నారు. ఈ సినిమా తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ చిత్రంతో ఆయన నటించనున్నారు. ఈ సినిమాతో పాటు శ్యామ్ సింగరాయ్ చిత్రం ప్రకటించాడు. ఈ సినిమాలు కాకుండా ‘బ్రోచెవారెవరురా’ ఫేం వివేక్ ఆత్రేయతోనూ ఓ సినిమా చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.
అయితే తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం నాని ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథకు ఓకే చెప్పినట్లు చెబుతున్నారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన శ్రీకాంత్ ఓడెల దర్శకుడిగా పరిచయమవుతూ ఓ చిత్రం తెరకెక్కుతుండగా ఆ మూవీలో హీరోగా నాని నటిస్తున్నాడట. ఈ మధ్యనే నానికి చెప్పగా ఆ సినిమా నానికి బాగా నచ్చిందట. అందుకే ఈ సినిమాని తెరకెక్కించే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా సుకుమార్ వ్యవహరించనున్నాడు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై సుకుమార్ దగ్గర పనిచేసిన దర్శకులు సినిమాలు చేస్తుంటారు. ఇప్పుడు కూడా అదే బ్యానర్ లో శ్రీకాంత్ తన తొలి సినిమా దర్శకత్వం వహించబోతున్నారని అంటున్నారు.