ఓవర్సీస్ మార్కెట్ ఇక అంతేనా.. అక్కడ ఓటిటి రాజ్యమేనా..?

ఇప్పుడు ఇదే అనుమానం అందరిలోనూ వస్తుంది. పరిస్థితులు చూస్తుంటే వచ్చే ఏడాది వరకు కూడా ఓవర్సీస్ మార్కెట్ అంతా కుంటుపడిపోయినట్లే కనిపిస్తుంది. ఇప్పట్లో అక్కడ సినిమాలు విడుదల చేయడం.. వాటికి లాభాలు తెచ్చుకోవడం అనేది కలలో మాటే. ఎందుకంటే కరోనా మన దేశాన్ని మాత్రమే కాదు ఫారెన్ కంట్రీస్ ను కూడా దెబ్బేసింది. ఇంకా చెప్పాలంటే మన ఓవర్సీస్ అగ్రపీఠం అమెరికాను పూర్తిగా దెబ్బకొట్టింది. అక్కడ పరిస్థితులు చూస్తుంటే మరో ఆర్నెళ్ల వరకైనా కూడా సినిమాలు విడుదల చేయడం గగనంగానే కనిపిస్తుంది. రేపటి రోజున సినిమాలు విడుదల చేసి బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్ పెట్టినా కూడా ఎవరూ వచ్చేలా కనిపించడం లేదు. కొన్నేళ్లుగా మన తెలుగు ఇండస్ట్రీకి ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్ ఎంత ముఖ్యంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక్కడి సినిమా విజయాలను కూడా అక్కడి కలెక్షన్లు నిర్ణయిస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో ఓవర్సీస్ కు మన దర్శక నిర్మాతలు కూడా చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. మరీ ముఖ్యంగా ఓవర్సీస్ బయ్యర్లను కూడా దృష్టిలో పెట్టుకుంటున్నారు.
సాధారణంగా సినిమా విడుదలకు శుక్రవారం అనువైంది. కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. బుధవారం విడుదల ఎక్కువగా కనిపిస్తున్నాయి. మంగళవారం ఓవర్సీస్ లో బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్ ఉంటుంది. ఆ రోజు ప్రీమియర్స్ గానీ పడితే వసూళ్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. పైగా ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలను ఎక్కువ రేట్లు పెట్టి తీసుకుంటున్నారు బయ్యర్లు. అందుకే మంగళవారం ప్రీమియర్స్ వేస్తే.. ఆ ఒక్క రాత్రి నుంచే మిలియన్ మార్క్ అందుకునే అవకాశం కూడా లేకపోలేదు. అలా డేట్స్ చూసుకుని మరీ మన సినిమాలు విడుదల చేస్తున్నారు నిర్మాతలు. దీన్నిబట్టి ఓవర్సీస్ మార్కెట్ ఎంత పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. సినిమా ఎలా ఉన్నా కూడా ప్రీమియర్స్ కు భారీ వసూళ్లు వస్తున్నాయి కొన్నేళ్లుగా. ఆ తర్వాత కూడా టాక్ బాగుంటే కలెక్షన్లు చాలా బాగా వస్తాయి. తద్వారా ఓవరాల్ వసూళ్లు కూడా అద్భుతంగా ఉంటాయి. అయితే ఓవర్సీస్ మార్కెట్ అనేది ఇప్పట్లో కలే. తెలుగు సినిమాకు పీడకలే. ఇంకా చెప్పాలంటే ఇండియన్ సినిమాకు ఇప్పుడు పీడకలే. కరోనా దెబ్బకు పూర్తిగా అతలాకుతలం అయిపోయింది అక్కడి మార్కెట్. మరి అది ఎప్పుడు పైకి లేస్తుందో చూడాలిక. అసలు లేస్తుందో లేదో కూడా తెలియదు.