చిరంజీవి అక్కగా విజయశాంతి..అయ్యేపనేనా

చిరంజీవి కథల విషయంలో పర్టిక్యులర్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. అందుకే ఆయనకు సక్సెస్ రేట్ ఎక్కువగానే ఉంటుంది. కమర్షియల్ లెక్కలు, అభిమానుల అంచనాలు లేక్కేసుకుని అన్నీ సరితూగుతాయని అనుకుంటే తప్ప సినిమాలకి ఊరికే కమిట్ అయిపోడు. ఇప్పుడు కూడా ఆయన సినిమాల ఎంపిక అలానే ఉంటుంది. ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో ఆచార్య చేస్తున్న చిరంజీవి నెక్ట్స్ సుజిత్ దర్శకత్వంలో 'లూసిఫర్' రీమేక్ చెయ్యబోతున్నాడు. మోహన్‌లాల్, పృథ్వీరాజ్ కాంబినేషన్లో రూపొందిన 'లూసిఫర్' మాలీవుడ్ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ స్టోరీనే తెలుగు ప్రేక్షకుల ముందుకి వస్తోండగా మళయాళంలో మోహన్‌లాల్ పోషించిన పాత్రని ఇక్కడ చిరంజీవి ప్లే చెయ్యబోతున్నాడు.
అయితే లూసిఫర్ సినిమాలో మోహన్ లాల్ క్యారెక్టర్‌కి జోడీ ఉండదు. ఎక్కడా కనీసం హీరోయిన్ ఫోటో కాదు కదా అసలు ఆ ఊసే ఎక్కడా వినిపించదు. పాలిటిక్స్, మాఫియా నేపధ్యంలో సాగే ఈ సినిమాలో చిరంజీవికి హీరోయిన్ ని పెడుతున్నారని ఒకసారి, అలా లేదని ఒకసారి ప్రచారం జరుగుతూ వస్తోంది. ఆ విషయం మీద క్లారిటీ లేకున్నా ఈ సినిమాలో విజయశాంతి కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే అది చిరుకు అక్క పాత్ర అవ్వచ్చని అంటున్నారు. ఎందుకంటే అంతటి కీలకమైన ఈ పాత్రను మలయాళంలో మంజూ వారియర్ పోషించారు.
ఇప్పుడు తెలుగులో కొందరి పేర్లు వినిపించినా తాజాగా విజయశాంతి పేరు తెర మీదకు వచ్చింది. నిజానికి టాలీవుడ్ లో చిరంజీవి - విజయశాంతి జోడీకి మంచి క్రేజ్ ఉంది. వీళ్లిద్దరి కలయికలో ఇప్పటి వరకు 15కు పైగా చిత్రాలు రాగా మూడు నాలుగు చిత్రాలు మినహా మిగతావన్నీ బాక్సాఫీస్ భారీ విజయాల్ని అందుకున్నాయి. ఇక వీళ్లిద్దరూ ఆఖరిగా 1993లో వచ్చిన ‘మెకానిక్ అల్లుడు’ చిత్రంలో నటించాక మళ్లీ తెరపై ఒకటిగా సందడి చేసింది లేదు. కానీ, ఇప్పుడు దాదాపు 27ఏళ్ల తర్వాత ఈ ఇద్దరినీ తెరపై దర్శించుకునే అవకాశం రాబోతుందని అంటున్నారు.