English   

బాలయ్య వ్యాఖ్యలకు అర్థమేంటి.. చిరంజీవి నాయకత్వం నచ్చట్లేదా..

Balakrishna
2020-05-28 17:23:20

ఇన్నిరోజులు ఈ కామెంట్స్ వస్తుంటే అబ్బే అలాంటిదేమీ లేదు అని కవర్ చేశారు. కానీ సాక్ష్యం దొరికింది. నిజంగానే చిరంజీవి నాయకత్వంతో ఒక వర్గం అసంతృప్తిగా ఉన్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో ఇది నిజమే అని అర్థమయిపోయింది. నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయన ఘాట్ కు వచ్చి నివాళులు అర్పించాడు బాలకృష్ణ. అక్కడే ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. సినిమా షూటింగ్స్ గురించి టాలీవుడ్ పెద్దలతో ప్రభుత్వం చర్చించిన విషయం అసలు తనకు తెలియదు అని చెప్పడం నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే టాలీవుడ్లో బాలకృష్ణ అగ్ర హీరో. అలాంటిది ఆయనకు తెలియకుండా ఎందుకు ఉంటుంది అని కొందరు అడుగుతున్న ప్రశ్న. ఆ మీటింగ్ చిరంజీవి ఇంట్లో జరగడం.. అన్నింట్లోనూ చిరంజీవి ముందు ఉండటం కొందరికి నచ్చడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే బాలయ్య ఇలాంటి వ్యాఖ్యలు చేసాడేమో అంటున్నారు విశ్లేషకులు. అయినా వ్యతిరేకత లేని నాయకత్వం అనేది ఎక్కడా ఉండదంటారు ప్రజాస్వామ్యంలో.

ఎంత బాగా ఉన్నా కూడా నాయకుడిపై ఎక్కడో ఓ చోట వ్యతిరేకత అయితే కచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కూడా ఇదే జరుగుతుందని తెలుస్తుంది. ఈ మధ్య ఏ మీటింగ్ జరిగినా.. ఏ చర్చ జరిగినా కూడా చిరంజీవి ముందుంటున్నాడు. అన్నీ తానే అయి ఆయనే నడిపిస్తున్నాడు. ఇప్పుడు ఆగిపోయిన సినిమా షూటింగ్స్ విషయంలో కానీ.. జరగాల్సిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ విషయంలో కానీ అన్నింట్లోనూ ముందు చిరంజీవే కనిపిస్తున్నాడు. ముఖ్యమంత్రితో మాట్లాడటం దగ్గర్నుంచి.. మంత్రి తలసానితో తన ఇంట్లోనే సినిమా పెద్దలతో చర్చించడం వరకు అన్నింటా మెగాస్టార్ ప్రమేయం ప్రముఖంగా కనిపిస్తుంది. దాంతో ఈ జోక్యం కొందరు హీరోలకు నచ్చడం లేదని ప్రచారం జరుగుతుంది. 

చిరంజీవి ఒక్కడు అడిగితేనే చేస్తారా.. మేం ఇండస్ట్రీలో లేమా.. లేదంటే మా గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదా అంటూ వాళ్లు సన్నిహితులతో చెప్తున్నట్లు తెలుస్తుంది. చిరంజీవి ఏమైనా ఇండస్ట్రీకి నాయకుడా.. లేదంటే అంతా కలిసి ఆయనకు ఏదైనా అధికారం కట్టబెట్టారా.. అన్నింట్లోనూ ఎందుకు అంతగా ముందుకు వెళ్తున్నాడు.. పేరు తీసుకోడానికా అంటూ కొందరు హీరోలు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పైకి మాత్రం చిరంజీవి చాలా మంచి పనులు చేస్తున్నాడు.. ఇండస్ట్రీ కోసం పాకులాడుతున్నాడు అంటూనే లోపల మాత్రం పేరు మొత్తం కొట్టేస్తున్నాడంటూ ఆయన తీరుపై కాస్త అసహనంగా ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే వాళ్లు మీటింగ్స్ కు కానీ.. చర్చలకు కానీ రావడం లేదని ప్రచారం జరుగుతుంది. మరి ఈ దుమారం ఎంత దూరం వెళ్తుందో చూడాలిక.

More Related Stories