English   

టాలీవుడ్‌లో ఆధిపత్య పోరు మొదలైపోయిందా..?

tollywood
2020-05-29 14:34:17

ఇన్ని రోజులు కరోనా కారణంగా తామంతా ఒక్కటే.. అంతా కలిసే ఉంటాం.. అందర్నీ ఆదుకుంటామంటూ సినిమా పెద్దలంతా కలిసి మీటింగ్ పెట్టారు. ఎక్కడ చూసినా కూడా కలిసే కనిపించారు. చిరంజీవి మొదలు పెట్టిన కరోనా క్రైసిస్ ఛారిటీకి కూడా అంతా కలిసి కోట్ల విరాళాలు అందించారు. అయితే అంతా బాగానే ఉంది కానీ ఉన్నఫలంగా ఒక్క కుదుపు వచ్చేసింది. ఆ కుదుపు పేరు బాలకృష్ణ నందమూరి. ఈయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. ఇండస్ట్రీ నిలువునా చీలిపోయిందని.. వర్గపోరుతో పాటు ఆధిపత్య పోరు కూడా ఇక్కడ జోరుగానే నడుస్తుందని ఈయన మాటలతో స్పష్టం అయిపోయింది. ఎప్పుడు అడిగినా కూడా మేమంతా ఒక్కటే అని చెప్పుకునే ఇండస్ట్రీ పెద్దలు మాత్రం ఇప్పుడేం చెప్తారనేది ఆసక్తికరంగా మారింది. బయటికి అంతా ఒక్కటే అంటున్నా కూడా లోపల మాత్రం ఒకరంటే ఒకరికి పడదు.. ఒకరి నిర్ణయాన్ని మరొకరు ఒప్పుకోరు.. ఇప్పుడు కూడా ఇదే జరిగింది.

ఇండస్ట్రీ పెద్దలంతా కలిసి తలసానితో చిరంజీవి ఇంట్లో మీటింగ్ పెట్టుకుంటే భూములు పంచుకోడానికి కూర్చున్నారా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ఇండస్ట్రీలో తాను కూడా ఉన్నానని.. అసలు తనకు ఒక్క మాట కూడా ఎవరూ చెప్పలేదని ఆయన చెప్పడం సంచలనంగా మారింది. పైగా మంత్రి తలసానితో కలసి హైదరాబాద్ లో పరిశ్రమ వాళ్లంతా భూములు పంచుకుంటున్నారా అని ప్రశ్నించటంతో విషయం మరింత పెద్దదైంది. ఇదే విషయంపై నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ పరిశ్రమలో దాసరి తర్వాత పెద్ద దిక్కు చిరంజీవే అని.. అందుకే అందరూ ఆయన నివాసంలో సమావేశం అయ్యారని చెప్పుకొచ్చాడు. దాంతో పాటు నిర్మాతలు తమ కష్టాలు ప్రభుత్వానికి చెప్పుకోడానికి అక్కడికి వచ్చాం కానీ.. రియల్ ఎస్టేట్ కోసం కాదని.. బాలయ్య అలా అనకుండా ఉండాల్సిందని చెప్పాడు. ఒకవేళ సమస్యలు చెప్పుకోవాలనుకున్నపుడు అక్కడికి వచ్చుంటే బాగుండేదని చెప్పాడు ఈయన. మరోవైపు దాసరి తర్వాత చిరంజీవి అని దిల్ రాజుతో సహా పలువురు నిర్మాతలు కూడా చెప్పడంతో మిగిలిన వర్గానికి అది పొసగడం లేదని అర్థమైపోతుంది.

గతంలో ఎప్పుడూ ఇలాంటి సమావేశాలకు బయటకు రాని ప్రముఖ దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి వారు కూడా ఈ సారి బయటకు వచ్చారంటే కారణం సొంత ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయనే వార్తలు కూడా వస్తున్నాయి. కరోనా సంక్షోభ సమయంలో షూటింగ్ కు అనుమతుల అంశంపై సీనియర్ హీరోలు  చిరంజీవి, నాగార్జునలే కీలక పాత్ర పోషించారు కానీ.. ప్రస్తుతం భారీ మార్కెట్ ఉన్న హీరోలు ఎవరూ ఇక్కడ కనిపించలేదు. అందరి సమస్య అయినపుడు అంతా కనిపించాలి కదా అని కొందరు బాహాటంగానే అడుగుతున్నారు. తమకెందుకులే పెద్దోళ్లే చూసుకుంటారని వదిలేయడం ఎంతవరకు కరెక్ట్ అనే వాళ్లు కూడా లేకపోలేదు. మరోవైపు నాగబాబు కూడా బాలయ్య వ్యాఖ్యలపై చాలా సీరియస్ అయ్యాడు. మీరేం పడితే అది మాట్లాడితే.. యిష్టమొచ్చినట్లు అభాండాలు వేస్తుంటే చూస్తూ ఎవ్వరూ కూర్చోడానికి సిద్ధంగా లేరు.. నోరు అదుపులో పెట్టుకోండి బాలయ్య గారు అంటూ ఫైర్ అయ్యాడు. ఏదేమైనా ఇప్పుడు జరుగుతున్న తీరు చూస్తుంటే మాత్రం ఇండస్ట్రీలో ఆధిపత్య పోరు జోరుగానే జరుగుతుందనే విషయం సుస్ఫష్టమవుతుంది.

More Related Stories