మోక్షజ్ఞ ఎంట్రీపై బాలకృష్ణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు..

నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు చాలా రోజులుగా వేచి చూస్తున్నారు. జూనియర్ బాలయ్య వస్తాడు.. వచ్చీ రాగానే బాక్సాఫీస్ తాట తీస్తాడు అనే ఊహల్లో ఉన్నారు అభిమానులు. పైగా నందమూరి ఫ్యామిలీ అంటేనే మాస్.. వాళ్లకు ఉన్నంత మాస్ ఫాలోయింగ్ మరెవరికీ ఉండదు. ఒక్క సినిమా హిట్టైతే చాలు ఆటోమేటిక్ గా స్టార్స్ అయిపోతారు. సింహాద్రి ఎఫెక్ట్ తో ఇప్పటికీ సూపర్ స్టార్ గానే ఉన్నాడు ఎన్టీఆర్. ఇక బాలయ్య సంగతి చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడో ఓ సారి హిట్ కొట్టినా..అది సాలిడ్ గా ఉంటుంది. ఇప్పుడు అదే కుటుంబం నుంచి మరో వారసుడు వస్తున్నాడు. అతడే మోక్షజ్ఞ. 13 ఏళ్ల కింద నందమూరి ఫ్యామిలీ నుంచి వస్తోన్న వారసుడు మోక్షు. కళ్యాణ్ రామ్ తర్వాత మళ్లీ కొత్త హీరో ఎవరూ రాలేదు. అఖిల్ 20 ఏళ్లకు హీరోగా ఎంట్రీ ఇచ్చేసాడు. చరణ్ కూడా అప్పట్లో 22 ఏళ్లకే హీరో అయ్యాడు.. బన్నీ అయితే మరీ 18 ఏళ్లకే వచ్చేసాడు.. నాగచైతన్య 22 కు వచ్చాడు. ఇప్పుడు మోక్షజ్ఞ కూడా 20 ల్లోకి వచ్చేసాడు.
దాంతో వారసున్ని త్వరగా తీసుకురావాలని అభిమానులు కూడా గోల పెడుతున్నారు. చాలా ఏళ్లుగా మోక్షు సినిమాల్లోకి వస్తాడా రాడా అనే చర్చ అయితే నడుస్తుంది. అలాంటి వాళ్లకు ఇప్పట్లో మా వాడు త్వరలోనే వస్తాడు అంటూ బాలయ్య తీపి కబురు చెప్పాడు. ఈ మధ్య నటనపై ఆసక్తి చూపిస్తున్నట్లు చెప్పాడు నందమూరి నటసింహం. మోక్షు చదువుకుంటున్నాడని.. ఆయనకు చదువు తప్ప మరో ప్రపంచం లేదని అప్పట్లో చెప్పిన బాలయ్య.. ఇప్పుడు మాత్రం త్వరలోనే వస్తాడని చెప్పుకొచ్చాడు. కానీ ఆ త్వరలో ఎప్పుడనేది మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు బాలకృష్ణ. రెండేళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీపై వార్తలు వినిపిస్తున్నా కూడా ఎక్కడా అయితే క్లారిటీ రావడం లేదు. సాయి కొర్రపాటి మాత్రం మోక్షు కోసం ఇప్పటికే రానే వచ్చాడు రామయ్యా అనే టైటిల్ కన్ఫర్మ్ చేసారు. ఇక ఓ షోలో పాల్గొన్న అనిల్ రావిపూడి తనకు మోక్షతో సినిమా చేయాలని ఉందని.. ఎప్పటికైనా చేస్తానని చెప్పాడు. దానికి తోడు మోక్షజ్ఞ కోసం ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్ర కథ సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా రాబోయే రెండేళ్లలో బాలకృష్ణ తనయుడు తెరమీద కనిపించడం ఖాయంగా కనిపిస్తుంది.