తలైవి ఓటీటీ రైట్స్ కోసం భారీ డిమాండ్

దివంగత సీఎం జయలలిత జీవితం ఆధారంగా తలైవి సినిమా తెరకెక్కుతోంది. ఆ సినిమా ఫస్ట్‌లుక్ ఈ మధ్యే విడుదలైంది. అమ్మ లుక్‌లో నటి కంగనా రనౌత్ ఏ మాత్రం గుర్తు పట్టలేని రీతిలో కనిపించారు. పచ్చ చీరలో అభివాదం చేస్తున్న బ్యానర్ ను ఈ ఫస్ట్ లుక్ లో చూపించారు. జయలలిత జీవితంలో ఎంతో ముఖ్య వ్యక్తి శశికళ. ఆమె పాత్ర ఎవరు చేస్తారా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొని ఉండగా ఆ పాత్ర కోసం నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి నటిస్తోంది. తలైవీ చిత్రానికి హలీవుడ్‌కు చెందిన ప్రముఖ మేకప్‌మెన్ జోసన్ కాలిన్స్ పని చేస్తున్నట్టు చెబుతున్నారు. నిజానికి ఈ నెల 26న ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లు గతంలో చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఇప్పటి పరిస్థితులో అది అసాధ్యం. అయినా సరే పరిస్థితులు అన్నీ సరయ్యాకే దీనిని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అయితే తలైవి ఓటీటీ హక్కుల కోసం భారీ డిమాండ్ మాత్రం నెల కొంది.
అమేజాన్, నెటిప్లిక్స్ సంస్థలు సంయుక్తంగా తలైవి ఓటీటీ హక్కులను దక్కించుకున్నాయి. హిందీ, తమిళ భాషలకు కలిపి 55 కోట్ల రూపాయలు చెల్లించినట్టు తెలుస్తోంది. థియేట్రికల్ రైట్స్ కోసం కూడా భారీ డిమాండ్ నెలకొంది. బాలీవుడ్ స్థార్ హీరోయిన్ కంగనా రనౌత్ జయలలిత క్యారెక్టర్‌ను పోషిస్తుండటంతో తలైవి సినిమాకు మరింత హైప్ వచ్చింది. ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటులు కూడా కనిపించబోతున్నారు. లాక్డౌన్ పూర్తయిన వెంటనే మిగిలున్న కొద్దిపాటి షూటింగ్‌ను కూడా పూర్తి చేసి ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేసే సన్నాహాల్లో ఉన్నారు దర్శకుడు ఏఎల్ విజయ్. ఈ సినిమాలో జయలలితగా కంగన నటిస్తుండగా ఎంజీఆర్‌గా అరవింద్ స్వామి కనిపించనున్నారు. ఈ సినిమాను విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్.సింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.