సోనూ సూద్ లాంటి వాళ్ళు ఎవరూ టాలీవుడ్ లో లేరా

ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఇప్పుడు ఎందరికో ఆదర్శంగా మారాడు. ఎందుకంటే తెర మీద విలన్ వేషాలు వేసే ఈ నటుడు కరోనా కాలంలో ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులని ఆదుకునేందుకు సొంత ఖర్చుతో రైళ్ళు, ఫ్లైట్స్ ఏర్పాటు చేసి వారిని సొంత రాష్ట్రాలకి తరలిస్తూ ఎంతో మంది మన్ననలను అందుకుంటున్నారు. అయితే ఆయన సేవ చూసి చాలా మంది మెచ్చుకుంటుంటే కొందరు మాత్రం ఆయనను విమర్శిస్తున్నారు. అయినా ఆయన ఎటువంటి వెనకడుగు వేయకుండా సేవ చేస్తున్నారు.
ఇప్పుడు లాక్ డౌన్ లో సడలింపులు ఇవ్వడంతో చాలా వరకూ ప్రయాణ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. అయినా సరే ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇంకా వలస కూలీలు సొంతూళ్లకు వెళ్లేంత స్తోమత లేక ఇబ్బందులు పడుతున్నారు. వారికి కూడా సోనూ సాధ్యమయినంత సాయం చేస్తున్నాడు. అయితే సోనూసూద్ లాగా టాలీవుడ్ లో స్టార్ అనిపించుకుంటున్న ఎవరూ ముందుకు రాకపోవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది వలస కూలీలు కనీసం ప్రయాణానికి సరిపడా ఆర్థిక స్తొమత లేక ఇబ్బందులు పడుతున్నా ఎవరూ వారిని పట్టించుకున్న పాపాన పోలేదు. సామాన్యులు వారికి తోచినంత సాయం చేస్తున్న మన టాలీవుడ్ సెలబ్రిటీలు సైలెంట్ గా ఉన్నారు. ఇలాంటి సమాజానికి సేవ చేసే పనులు వదిలేసి ఆ వంట పనులు, పెంట పనుల ఛాలెంజులు చేస్తే రియల్ హీరోస్ అనిపించుకోరని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.