English   

బాలయ్య అయినా నా రేటు ఇంతే అంటున్న కాజల్..

Kajal Agarwal
2020-06-13 08:21:13

కెరీర్ మొదలు పెట్టి పుష్కరం దాటేసిన కూడా ఇప్పటికీ పుష్కలంగా అవకాశాలు దక్కించుకుంటోంది కాజల్ అగర్వాల్. స్టార్ హీరోలు, చిన్న హీరోలు అనే తేడా లేకుండా అందరితోనూ నటిస్తూ ఇప్పటికీ బిజీగానే ఉంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం చిరంజీవి సరసన ఆచార్య సినిమాలో నటిస్తుంది కాజల్. దాంతో పాటు తమిళంలో ఒక సినిమా.. హిందీలో రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇదే సందర్భంలో బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. పైగా ఈ మధ్య చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని సినిమాల్లో కాజల్ నటిస్తుంది. బాలకృష్ణ సినిమాలో నటించడానికి కూడా చందమామ ఆసక్తి చూపించిందని తెలుస్తుంది.

అయితే బాలయ్య సరసన నటించడానికి ఈమె ఏకంగా రెండు కోట్ల వరకు డిమాండ్ చేసిందని ప్రచారం జరుగుతుంది. ఒకేసారి అంత భారీ పారితోషికం డిమాండ్ చేసే సరికి నిర్మాతకు గుండె ఆగిపోయినంత పని అయిపోయింది. అసలే లాక్ డౌన్ కారణంగా నిర్మాతకు భారీ నష్టం వచ్చింది. అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాకపోవడంతో చిత్ర యూనిట్ కూడా పారితోషికంలో కోత విధించాలని భావిస్తుంది. ఇలాంటి సమయంలో కాజల్ భారీ పారితోషికం డిమాండ్ చేయడంతో ఆమెను కాదని మరో హీరోయిన్ వైపు అడుగేస్తున్నాడు బోయపాటి శ్రీను. ఈ విషయంలో బాలయ్య కూడా బోయపాటిని సమర్ధిస్తున్నాడు. అంత భారీ రెమ్యునరేషన్ ఇచ్చే కంటే కూడా మరో హీరోయిన్ ను చూడాలని ఆయన కూడా సూచించినట్లు తెలుస్తుంది. ఏదేమైనా గతంలో కూడా ఓ సారి బాలకృష్ణతో నటించే అవకాశం వచ్చినా పారితోషికం విషయంలో కాజల్ వదిలేసుకుందని ప్రచారం జరిగింది. ఇప్పుడు బోయపాటి శ్రీను సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుంది. 

More Related Stories