చావు ఒకటే అన్నిటికీ పరిష్కారమా.. ఆత్మహత్యే శరణ్యమా..

బతకలేనంత కష్టం వస్తే చచ్చిపోవడం ఒక్కటే సమాధానమా..? ఇక మరో ఆప్షన్ కూడా లేదా..? ఉండదా.. అప్పటికప్పుడు తనువు చాలించడం ఒక్కటే మార్గమా..? బతికి సాధించలేంది.. చచ్చి ఏం సాధిస్తారు.. ఇంత చిన్న విషయం అర్థం చేసుకోలేక దేవుడు ఇచ్చిన జీవితాన్ని మధ్యలోనే తుంచేసుకుంటున్నారు కొందరు. అందులో చాలా మంది సినిమా వాళ్లే ఉండటం గమనార్హం. ఇక్కడి రంగుల ప్రపంచానికి అలవాటు పడి.. ఆ తర్వాత అవి లేక అల్లాడిపోతూ.. జీవితాన్ని మధ్యలోనే ఆపేసుకుంటున్నారు. బలవంతంగా గొంతు నులిమేసుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీ అంటే అద్దాల మేడ అనుకునే వాళ్లకు.. అక్కడ పగిలిపోయే జీవితాలు కూడా ఉంటాయని తెలుసుకోవాలి. అంతా అద్దాల మేడలోనే ఉండరు.. కొందరి జీవితాలు అట్టడగున ఉంటాయని అర్థం చేసుకోవాలి.
ఇండస్ట్రీలో సక్సెస్ అయితే ఓకే.. లేకపోతే మాత్రం కష్టాలు ఏం రేంజ్ లో ఉంటాయో చెప్పడం మాటల్లో కూడా సాధ్యం కాదు. మరే ఇండస్ట్రీలోనైనా ఫెయిల్ అయితే మరోటి ట్రై చేస్తారు. కానీ ఇండస్ట్రీలో ఫెయిలైతే మాత్రం ఏకంగా ఆత్మహత్యే శరణ్యం అనుకుంటారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి కొందరు.. అదఃపాతాళానికి పడిపోయి జీవితం ముందుకు సాగించలేక మరి కొందరు.. కెరీర్ లో సరైన బ్రేక్ రాలేదని కొందరు.. కుటుంబ కలహాలతో ఇంకొందరు.. ప్రేమ పేరుతో మరికొందరు.. నిండు జీవితాన్ని మధ్యలోనే తుంచేసుకుంటున్నారు. ఇండస్ట్రీలో అయితే ఇది మరీ ఎక్కువగా ఉంది.
ఆత్మహత్య ఇప్పుడు ఓ ఫ్యాషన్ గా మారిపోయింది. ఇది వరకు ఎన్నో ఆత్మహత్యలు ఇండస్ట్రీని కుదిపేసాయి. ఇప్పుడు బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య మొత్తం దేశంలో సంచలనంగా మారింది. బంగారం లాంటి భవిష్యత్తు కళ్ళముందు కనిపిస్తుండగా కేవలం 34 ఏళ్ల వయసులో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. మానసిక ఒత్తిడి కారణంగా తనువు చాలించాడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్. ఆయన కెరీర్లో 90 శాతం సక్సెస్ రేటు ఉంది అంటే ఎంత అద్భుతమైన హీరో అనేది అర్థం చేసుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా గతేడాది ఆయన నటించిన చిచోరే సినిమాలో ఆత్మహత్య చేసుకోవడం తప్పు అని చెప్పాడు. కానీ నిజజీవితంలో ఆయనే ఇలా చేయడంతో అభిమానులు ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కోట్ల రూపాయల ఆస్తి కోట్లాది మంది అభిమానులు ఉన్న కూడా చివరికి ఒంటరిగా వెళ్ళిపోయాడు సుశాంత్.
కేవలం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాత్రమే కాదు.. ఎంతోమంది సినిమా నటులు ఇలా అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. సుశాంత్ మరణానికి నాలుగు రోజుల ముందు ఆయన మాజీ మేనేజర్ దిశ కూడా ఇలాగే ఆత్మహత్య చేసుకుంది. బాలీవుడ్ నటులు కుశాల్ పంజాబీ, ప్రేక్ష మెహతా లాంటి వాళ్లు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఆ మధ్య తెలుగు కమెడియన్ విజయ్ సాయి కూడా ఇలాగే చచ్చిపోయాడు. కమెడియన్ గా ఒకప్పుడు వరస సినిమాలు చేసిన విజయ్.. ఉన్నట్లుండి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి అతడి ఆర్థిక ఇబ్బందులే కారణం అనుకున్నా కాదు కుటుంబ కలహాలే కారణం అని తెలిసాయి. భార్యతో అతడికి గొడవలున్నాయి. రెండేళ్లుగా వాళ్లు విడిగానే ఉంటున్నారు. పైగా పాపను కూడా చూడనివ్వడం లేదని.. తన కార్ కూడా భార్య తీసుకెళ్లిపోయిందని చనిపోయే ముందు సెల్ఫీ వీడియోలో చెప్పాడు విజయ్.
ఇక ఆ మధ్య తమిళనాట సీరియల్ యాక్టర్ సాయి ప్రశాంత్ ఆత్మహత్య చేసుకుని సంచలనం సృష్టించాడు. తర్వాత జెమినీ మ్యూజిక్ యాంకర్ నిరోషా ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ వ్యవహారమే ఈమె మరణానికి కారణమని తేల్చారు పోలీసులు. అంతేకాదు.. తెలుగు టీవీ నటుడు ప్రదీప్ కుమార్ ఆత్మహత్య కూడా ఆ మధ్య హాట్ టాపిక్ గా మారింది. భార్యతో గొడవలే ఈయన మరణానికి కారణం అని తెలిసింది. ఆ మధ్య ఒక న్యూస్ చానల్ లో పని చేసే ఆ యాంకర్ కూడా ఇలాగే ఆత్మహత్య చేసుకుంది. స్క్రీన్ పై ఎంతో సంతోషంగా కనిపించే వీళ్ల జీవితాలన్నీ లోపల మాత్రం చాలా భయంకరంగా ఉంటాయని ఈ ఉదంతాలతో అర్థమవుతుంది. జయసుధ భర్త నితిన్ కపూర్ మరణం కూడా ఇండియన్ ఇండస్ట్రీని ఉలిక్కిపడేలా చేసింది. ఈయన కూడా ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ముంబైలోని తన సొంత ఫ్లాట్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ మధ్య చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఏ చిన్న సమస్య ఎదురైనా పోరాడలేక జీవితాన్ని చాలిస్తున్నారు. గతేడాది ఓంకార్ ఆట షోలో డాన్సర్ గా మంచి పేరు సంపాదించిన భరత్.. ఆర్థిక ఇబ్బందులు తాళలేక హైదరాబాద్ లోని తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఓంకార్ షో లో కామెడీ చేస్తూ.. కొరియోగ్రఫర్ గానూ మంచి పేరు సంపాదించాడు భరత్. అయితే కొంతకాలంగా అవకాశాల్లేకపోవడం.. ఆర్థికంగా బాగా చితికిపోవడంతో జీవితంపై విరక్తి చెంది సూసైడ్ చేసుకున్నాడు భరత్. సీనియర్ నటుడు రంగనాథ్ సైతం ఆ మధ్య సుసైడ్ చేసుకోవడం విచారకరం. ఇద్దరమ్మాయిలు, ఓ కొడుకు ఉండి కూడా ఒంటరితనాన్ని అనుభవించారు రంగనాథ్. అవకాశాలు లేకపోవడం కూడా ఆయన్ని బాగా కలిచివేసింది. ఇలాంటి పరిస్థితుల్లో అందరూ ఉన్న అనాథలా ఆయన వెళ్లిపోయారు. ఇంట్లోనే డెస్టినీ అంటూ తన తలరాతను తనే బలవంతంగా తుడిచేసుకున్నారు. అనంతలోకాలకు వెళ్లిపోయారు.
ఆరేళ్ల కింద ఉదయ్ కిరణ్ కూడా ఇలాగే ఆత్మహత్యతో అందర్నీ విడిచి వెళ్లిపోయాడు. హ్యాట్రిక్ విజయాలతో తెలుగు ఇండస్ట్రీకి తారాజువ్వలా దూసుకొచ్చిన ఉదయ్.. చివరికి కిరణంలా రాలిపోయాడు. తమిళ ఇండస్ట్రీలో ప్రేమికుల రోజు కునాల్.. బాలీవుడ్ లో జియాఖాన్.. టాలీవుడ్ లో సిల్క్ స్మిత, ఫటాఫట్ జయలక్ష్మి, దివ్య భారతి.. ఇలా చెప్పుకుంటూ పోతే రంగుల జీవితాల్లో నల్లమచ్చలు ఎన్నో కనిపిస్తాయి. మొత్తానికి వీళ్ళ సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాకపోయినా.. మనోవేదనతో క్షణికావేశంలో నిండు జీవితాల్నినిలువునా వదిలేస్తున్నారు వీళ్లంతా. ఈ మరణాలు ఇప్పటికైనా ఆగిపోతాయని.. ఆగిపోవాలని ఆ దేవున్ని ప్రార్థిద్ధాం..!