English   

ఆరేళ్లకోసారి ఓ యువ నటుడు ఆత్మహత్య.. ఏంటి శాపం..

Sushant Singh
2020-06-15 11:44:13

లెక్క అర్థం కాలేదు కదా.. కాస్త ఆలోచించి చూస్తే ఇదే నిజం అనిపిస్తుంది. సినిమా ఇండస్ట్రీలోకి తారాజువ్వలా దూసుకు వచ్చి.. వరుస విజయాలు అందుకుని.. తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న తర్వాత బంగారం లాంటి భవిష్యత్తు వేచి చూస్తూ ఉండగా ఎవరు ఊహించని విధంగా తన జీవితానికి ముగింపు పలికిన ముగ్గురు యువ కథానాయకుల కథ ఇది. అదేమి చిత్రమో గాని వాళ్ళ ముగ్గురి మరణానికి ప్రతీ ఆరేళ్ల వ్యత్యాసం ఉంది. ఇప్పుడు బాలీవుడ్ అగ్ర నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన తరువాత అభిమానులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న సినీ రాజకీయ ప్రముఖులు సుశాంత్ తీసుకున్న నిర్ణయానికి ఆశ్చర్యపోతూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు. సరిగ్గా ఆరేళ్ల కింద తెలుగు ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టించిన ఉదయ్ కిరణ్ అర్ధాంతరంగా కన్నుమూశాడు.

చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే, నీ స్నేహం, కలుసుకోవాలని, శ్రీరామ్ లాంటి సినిమాలతో అప్పట్లో యువతను పిచ్చెక్కించాడు ఉదయ్ కిరణ్. సూపర్ స్టార్ గా వెలిగిపోతుంది అనుకున్న ఈయన కెరీర్ ఒక్కసారిగా తలకిందులైంది. ఎన్నో ఏళ్లుగా తనతో తాను పోరాటం చేస్తూనే 2014 జనవరి 5న తన ఇంట్లోనే ఉరి వేసుకొని చనిపోయాడు. ఇక ఉదయ్ చనిపోయిన సరిగ్గా ఆరేళ్ల వెనక్కి వెళితే 90ల్లో ప్రేమికుల రోజు సినిమాతో సంచలనం సృష్టించిన కునాల్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పట్లో ఆయన పేరు ఒక సంచలనం.. ప్రేమికుల రోజు పాటలు ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్ గా ఉన్నాయి. ఆ సినిమాలో కునాల్ సింగ్ హెయిర్ స్టైల్ ఒక సంచలనం. ఒకే సినిమాతో ట్రెండ్ సెట్టర్ గా మారిన ఈ యువ నటుడు 2008 లో ఆత్మహత్య చేసుకున్నాడు. కేవలం 32 ఏళ్ల వయసులో ఆయన తనువు చాలించాడు. ఇండియన్ సినిమాలో చెరగని ముద్ర వేసిన ఈ ముగ్గురు నటులు క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఈ ముగ్గురు ఆత్మహత్యలకు ఆరు సంవత్సరాల వ్యవధి ఉండటం ఆసక్తికరంగా మారింది. 2008లో కునాల్ సింగ్.. 2014లో ఉదయ్ కిరణ్.. 2020లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్.. ఇలా ముగ్గురు సంచలనాలుగా వచ్చి అంచనాలకు అందని విధంగా తమ జీవితానికి కన్నీటి ముగింపు ఇచ్చుకున్నారు.

More Related Stories