English   

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో సినిమా..

Pawan Kalyan Trivikram
2020-06-16 08:54:20

నేను సినిమాలు చేయడం లేదంటూనే మూడు సినిమాలకు ఓకే చెప్పాడు పవన్ కళ్యాణ్. అందులో కరోనా కానీ లేకపోయుంటే ఈ పాటికే ఒకటి విడుదలై ఉండేది.. మరోటి విడుదలకు సిద్ధమై ఉండేది. కానీ ఏం చేస్తాం కరోనా వచ్చి అన్నీ నాశనం చేసింది. ప్రస్తుతం పింక్ సినిమా రీమేక్ వకీల్ సాబ్‌తో పాటు క్రిష్ సినిమా కూడా ఒకేసారి పూర్తి చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలకు కూడా సమయం కేటాయిస్తున్నారు పవన్. జనసేన పార్టీని ఎలా జనాల్లోకి తీసుకెళ్లాలి అనేది మాత్రమే తన దృష్టిలో ఉందని.. ఇప్పుడు సినిమాలు చేసి తర్వాత మళ్ళీ రాజకీయాలు చేసే ఓపిక నాకు లేదు అంటూ చెప్పుకొచ్చాడు పవర్ స్టార్. అయితే ఆ పార్టీని నడపాలంటే డబ్బులు కావాలి. అందుకే మరో ఆప్షన్ లేక సినిమాలు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్.  ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడనే ప్రచారం జరుగుతుంది.

అల వైకుంఠపురములో సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఒక సినిమాకు కమిట్ అయ్యాడు త్రివిక్రమ్. ఇది పూర్తయ్యేలోపు పవన్ కూడా కొత్త సినిమాలు పూర్తి చేసుకోనున్నాడు. ఆ తర్వాత పవన్ త్రివిక్రమ్ ఓ సినిమా చేస్తారని ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఇమేజ్ కు సరిపోయే విధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ సిద్ధం చేయాలని చాలా రోజులుగా ఆలోచిస్తున్నాడు. అజ్ఞాతవాసి లాంటి సినిమాను పవన్ కళ్యాణ్ కి ఇవ్వడంతో ఆ లోటు భర్తీ చేయాలని భావిస్తున్నాడు త్రివిక్రమ్. ఖచ్చితంగా ఈసారి వచ్చే సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తుందని నమ్మకంగా చెబుతున్నారు అభిమానులు. మరో మూడేళ్ళ వరకు పవన్ కళ్యాణ్ చేయడానికి రాజకీయాలు కూడా ఏమీ లేవు. అందుకే ఆయన సినిమాలపై ఫోకస్ చేశాడు. ఒకేసారి మూడు సినిమాలు చేస్తున్నాడు పవన్. ఆ తర్వాత కూడా వరుసగా సినిమాలు చేయాలని ఆలోచిస్తున్నాడు. అందులో త్రివిక్రమ్ సినిమా కూడా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అన్నీ వర్కవుట్ అయ్యి పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ మరోసారి సినిమా చేస్తే మాత్రం ఈసారి నిజంగానే రికార్డులు బద్దలు కావడం ఖాయం. అభిమానులు కూడా ఇదే కోరుకుంటున్నారు.

More Related Stories