పాట్నాలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అస్తికలు నిమజ్జనం..

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మరణాన్ని అభిమానులు అంత త్వరగా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికీ ఆయన ఉన్నాడనే భ్రమలోనే ఉంటున్నారు. మరీ ముఖ్యంగా ఆయనను విపరీతంగా అభిమానించే ఇద్దరు ఫ్యాన్స్ తమ హీరో లాగానే ఆత్మహత్య చేసుకున్నారు. చాలా తక్కువ సమయంలోనే బాలీవుడ్లో స్టార్ హీరోగా ఎదిగాడు సుశాంత్. ఎంతో భవిష్యత్తు ఉన్న ఈయనను కొందరు తన స్వార్థం కోసం బలి చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అస్తికలను తన సొంత పట్టణం పాట్నాలో నిమజ్జనం చేశారు. తండ్రి కేకే సింగ్, సోదరి శ్వేతాతో సహా ఇతర కుటుంబ సభ్యులు కన్నీటి మధ్య సుశాంత్ అస్థికలను శాస్త్రోక్తంగా నదిలో కలిపారు. తన కుమారుడి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుని ప్రార్థించారు తండ్రి. ఇక సోదరి శ్వేతా మాట్లాడుతూ.. తన తమ్ముడు ఎప్పుడూ తనతో డిప్రెషన్ గురించి చెప్పలేదని.. ఒకవేళ చెప్పుంటే అతడి మొత్తం బాధను తాను తీసుకోవడానికి సిద్ధంగా ఉండేదాన్ని అంటూ ఏడ్చేసింది. మొత్తానికి ఈయన మరణం అభిమానులకు ఇప్పట్లో కోలుకోలేని షాక్.