English   

ఇంకెప్పుడు షూటింగ్ కు వస్తారు మన హీరోలు..

tollywood
2020-06-20 07:30:09

పర్మిషన్స్ లేనప్పుడు మాత్రమే అనుమతులు కావాలి అంటూ గవర్నమెంట్ చుట్టూ తిరిగారు. తీరా అనుమతులు వచ్చిన తర్వాత ఎవరూ ఇంటి నుంచి కాలు బయట పెట్టడం లేదు. ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఇలాగే ఉంది. తెలంగాణ ప్రభుత్వం జూన్ మొదటి వారం నుంచి సినిమా షూటింగ్ లతో పాటు సీరియల్ షూటింగ్ లు కూడా చేసుకోండి అంటూ అనౌన్స్ చేసింది. చూస్తుండగానే జూన్ మూడో వారం వచ్చేసింది. ఇప్పటికే కొన్ని సీరియల్ షూటింగ్స్ మొదలయ్యాయి. జబర్దస్త్ అదిరింది లాంటి కామెడీ షోలు కూడా మొదలుపెట్టారు. కానీ ఈ సినిమా షూటింగ్ మాత్రం ఇంకా మొదలు కాలేదు దానికి కారణం కరోనా వైరస్. పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ప్రభుత్వం దగ్గరకి వెళ్లి తమ సినిమాల షూటింగ్ చేసుకోవడానికి అనుమతి కావాలి అంటూ ముందుకు వెళ్తున్నారు దర్శక నిర్మాతలు. కానీ పెరుగుతున్న కరోనా కేసులు చూసి మాత్రం వాళ్లు కూడా భయపడుతున్నట్లు తెలుస్తోంది. ఆ మధ్య తెలంగాణలో కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన కరోనా కేసులు ఇప్పుడు మళ్ళీ పెరుగుతున్నాయి.గత వారం రోజుల్లో దాదాపు 1200 కొత్త కేసులు రావడంతో సినిమా ఇండస్ట్రీలో భయం మొదలైంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు తన సర్కారు వారి పాట సినిమాను డిసెంబర్ నుంచి మొదలు పెడతామని దర్శకనిర్మాతలకు చెప్పినట్లు తెలుస్తోంది. మిగిలిన వాళ్లు కూడా దాదాపు ఇదే ప్లాన్ లో ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ అంటేనే జనాలతో కిటకిటలాడే ఇండస్ట్రీ. ఇక్కడ కొంత మంది ఉంటే పని జరగదు. ఒక్కొక్క సినిమాకు వందలాది మంది పని చేస్తుంటారు. ఇక రాజమౌళి లాంటి దర్శకుడి సినిమా వేలాది మంది కార్మికులు నిత్యం పనిచేస్తూనే ఉంటారు. ఇలాంటి సమయంలో కరోనా వైరస్ నుంచి తప్పించుకొని షూటింగ్ చేయడం అనేది అంత చిన్న విషయం కాదు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఈ వైరస్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా ఎవరూ చెప్పలేని పరిస్థితి. దానికి తోడు దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. 

జూన్ మొదటి వారం నుంచి సినిమా షూటింగులు చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా అనుమతులు జారీ చేస్తుంది. కానీ ఇది ఇప్పట్లో తాము రాలేమని తెగేసి చెబుతున్నారు నటీనటులు. దీనికి కారణం కూడా లేకపోలేదు. సినిమాకు పని చేస్తున్న యూనిట్ లో ఏ ఒక్కరికి పొరపాటున కరోనా వైరస్ వచ్చిన కూడా అది అందరికీ వ్యాపించే అవకాశం చాలా వేగంగా ఉంటుంది. అది హీరో కావచ్చు హీరోయిన్ కావచ్చు.. లేదంటే దర్శకుడు కావచ్చు. ఈ మహమ్మారి ముందు అందరూ ఒకటే.. అందుకే పెరుగుతున్న కేసులు చూసి కాస్త వెనకడుగు వేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇక నటీనటులు కూడా ఇప్పట్లో షూటింగ్ అంటే రావడం కష్టంగానే మారింది. అయితే రాజమౌళి మాత్రం త్వరలోనే తన సినిమా షూటింగ్ మొదలు పెడతాను అని అనౌన్స్ చేశాడు. కానీ ఇప్పుడు ఈయన కూడా కేవలం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మాత్రమే చేసుకుని తర్వాత షూటింగ్ మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నాడు. 

More Related Stories