జాగ్రత్త పడిన సోనాక్షి..తనవరకూ రాకుండానే ..

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం బాలీవుడ్ సహా దేశాన్ని కుదిపేస్తోంది. ఇప్పటి వరకు ఎన్నడూ లేనంతగా స్టార్ కిడ్స్(వారసుల) మీద జనం మండి పడుతున్నారు. అలియా భట్, సల్మాన్ లాంటి స్టార్స్ కు, కరణ్ జోహార్ లాంటి దర్శక నిర్మాతకు కూడా ఈ సెగ తప్పడం లేదు. వాళ్ల సోషల్ మీడియా ఫాలోయర్స్ రోజరోజుకీ పడిపోతున్నారు. వాళ్ళను బాయ్ కాట్ చేస్తున్నామంటూ అభిమానులు ట్రెండ్స్ క్రియేట్ చేసి మరీ ఆడుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఇండస్ట్రీకి వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన సోనాక్షి కీలక నిర్ణయం తీసుకుంది. సోనాక్షి సిన్హా ట్విట్టర్ నుండి తప్పుకుంటున్నానని ప్రకటించింది. "మనఃశాంతిని కాపాడు కోవడానికి, నెగిటివిటికి దూరంగా ఉండటానికి నా ట్విట్టర్ అకౌంట్‌ను డియాక్టివేట్ చేశా"నని సోనాక్షి తెలిపింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా గ్రామ్ ద్వారా ఆమె వెల్లడించింది. ఒకప్పటి హీరో శత్రుఘ్న సిన్హా కూతురుగా తెరంగ్రేటం చేసిన ఈమె దబంగ్ సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది. ఇప్పటి వరకు సోనాక్షి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా 1320 పోస్టులు చేయగా ఆమె అకౌంట్ కు 18.5 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య నేపథ్యంలో స్టార్ కిడ్స్‌ని అన్ ఫాలో చేస్తూ, ట్రోల్ చేస్తున్న తరుణంలో సోనాక్షి తన వరకూ రాకుండానే ముందు జాగ్రత్త పడింది.