సుశాంత్ మరణం మీద తొలిసారి స్పందించిన సల్మాన్

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య విషయంలో సల్మాన్ నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్ తదితరులపై కొందరు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. సుశాంత్ ఆత్మహత్య తరువాత, కనీసం సంతాపం కూడా తెలపలేదని సల్మాన్ పై ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో సల్మాన్ తొలిసారిగా స్పందించారు. నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ అభిమానులు, కుటుంబ సభ్యులను ఆదరించాలని సల్మాన్ ఖాన్ తన అభిమానులకు సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేశారు.
ఆయన మరణించినప్పటి నుండి సల్మాన్ తో సహా సినీ పరిశ్రమకు చెందిన పలువురి మీద సోషల్ మీడియాలో ఆగ్రహ జ్వాలలు వస్తున్న క్రమంలో సుశాంత్ అభిమానుల నుంచి వస్తున్న విమర్శలను పట్టించుకోవద్దని, ఈ కష్ట సమయంలో వారిని అర్థం చేసుకుని అండగా నిలవాలని తాను కూడా సుశాంత్ ను ఎంతో మిస్ అవుతున్నానని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని తన ట్విట్టర్ ఖాతాలో సల్మాన్ పేర్కొన్నారు.
సుశాంత్ మరణించినప్పటి నుండి #JusticeForSushantSinghRajput, #BoycottSalmanKhan, #BoycottStarKids మరియు #BoycottBollywood వంటి హ్యాష్ట్యాగ్లు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నాయి. సల్మాన్ అభిమానులు ఆయన్ని వెనకేసుకు వస్తూ #WeStandWithSalmanKhan ని ట్రెండ్ చేశారు. ఇక సుశాంత్ ఆత్మహత్య విషయంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నటుడు బిహార్ కు చెందిన వ్యక్తి కావడంతో పరిశ్రమలోని పెద్ద పెద్ద అతన్ని వేరుచేసి చూశారని ఆరోపణలు ఉన్నాయి.