మారుతీరావు సూసైడ్ నోట్ చూసే మర్డర్ సినిమా...ఆర్జీవీ సంచలనం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య ఉదంతాన్ని తెరకెక్కిస్తున్నట్లు వివాదాస్పద డైరెక్టర్ ఆర్జీవీ ప్రకటించారు. ఫాదర్స్‌డే సందర్భంగా ఫస్ట్‌లుక్.. టైటిల్‌ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రానికి 'మర్డర్' అనే టైటిల్ ఖరారు చేశారు ఆర్జీవీ. 'ఓ తండ్రి కుమార్తెను అతిగా ప్రేమిస్తే ఎంత ప్రమాదమో తెలిపే అమృత, మారుతీరావు కథతో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. శాడ్ ఫాదర్స్ ఫిల్మ్ పోస్టర్‌ను ఫాదర్స్ డే రోజున విడుదల చేస్తున్నా' అంటూ వర్మ ట్వీట్ చేశారు. ఇది చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో వర్మ మీద అమృత రాసినట్టుగా ఒక లెటర్ హల్చల్ చేసింది.
అయితే ఈ విషయం మీద వర్మ స్పందిస్తూ తాను ఎందుకు సినిమా చేస్తున్నానో చెప్పుకొచ్చాడు కూడా. అయితే నిన్న ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ సినిమాని పగ నేపధ్యంలో తీయడం లేదని, ప్రేమ నేపధ్యంలో తీస్తున్నానని చెప్పుకొచ్చారు. తనకు ఈ హత్య వ్యవహారం ముందుగా తెలీదని, మారుతి రావు ఆత్మహత్య అప్పుడే ఎవరో తనకు ఆయన సూసైడ్ నోట్ పంపారని దానిని చూసే సినిమా తీయాలని నిర్ణయించుకున్నానని వర్మ చెప్పుకొచ్చాడు. అలాగే తాను అమృతను కలిసే ఉద్దేశం లేదని, దానికి సంబంధించిన info అంతా మీడియాలోనే దొరికేసిందని వర్మ చెప్పుకొచ్చాడు. చూద్దాం ఇది ఎన్ని వివాదాలకి దారి తీస్తుందో ?