విశాల్ చక్ర ట్రైలర్.. మరోసారి డిజిటల్ వరల్డ్ టార్గెట్..

ఒకప్పుడు వరుసగా మూస మాస్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశాల్.. ఇప్పుడు మాత్రం బాగా విషయం ఉన్న సినిమాలతో వస్తున్నాడు. కొన్నేళ్లుగా ఆయన ఎంచుకుంటున్న కథల్లో చాలా వైవిధ్యం కనిపిస్తుంది. అందుకే విజయాలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈయన చేస్తున్న చక్ర సినిమాపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఒకేసారి తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో ఈ ట్రైలర్ విడుదల చేశాడు నిర్మాత విశాల్. బ్యాంక్ రాబరీ, హ్యాకింగ్, సైబర్ క్రైమ్ నేపథ్యంలో అత్యుత్తమ సాంకేతిక విలువలతో సరికొత్త కథ కథనాలతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే హైదరాబాద్ సిటీ మొత్తం హై అలర్ట్‌లో ఉంటుంది కాని ఆరోజు.. అని విశాల్ వాయిస్ ఓవర్‌తో మొదలై 2 నిమిషాల 10 సెకండ్ల నిడివి గల ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.
మిలటరీ ఆఫిసర్ గా విశాల్ పవర్ఫుల్ ఎంట్రీ స్టైలీష్ గా ఉంది. ఒక దేశాన్ని బెదిరించే తీవ్రవాదుల యాక్టివిటీస్‌ని గమనించడానికి ఒక నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ చేసే రీసర్చ్ కంటే.. ఓ సగటు మనిషి అవసరాలు, వాడి ఆశలు తెలుసుకోవడం కోసం ఓ కార్పోరేట్ కంపెనీ చేసే రీసర్చే ఎక్కువ అంటారు.. కచ్చితంగా మనం వెతికే క్రిమినల్ మన కంటికి కనిపించడు.. ఇప్పుడే కదా వేడెక్కింది ది గేమ్ బిగిన్స్.. కంటికి కనిపించని వైరస్ మాత్రమే కాదు వైర్లెస్ నెట్వర్క్ కూడా ప్రమాదకరమే.. వెల్కమ్ టు డిజిటల్ ఇండియా లాంటి డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. యువన్ శంకర్ రాజా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఇక ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే రెండేళ్ల కింద విశాల్ నటించిన అభిమన్యుడు సినిమా గుర్తుకొస్తుంది. అందులో కూడా డిజిటల్ క్రైమ్ హైలెట్ చేశారు. దానికి సీక్వెల్ గా అనిపిస్తుంది చక్ర. శ్రద్దా శ్రీనాథ్, రెజీనా కసాండ్ర, మనోబాలా, రోబో శంకర్, సృష్టిడాంగే ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.