English   

అంజి సినిమా ఫ్లాప్ కు కారణం చెప్పిన ఆ ఒక్కడు..

 chiranjeevi
2020-07-02 06:55:45

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో భారీ బడ్జెట్ తో ఊహకందని గ్రాఫిక్స్ తో తెరకెక్కిన సినిమా అంజి. దాదాపు 20 ఏళ్ల కింద విడుదలైన ఈ సినిమాకు అప్పట్లో ఉత్తమ గ్రాఫిక్స్ కు జాతీయ అవార్డు కూడా వచ్చింది. కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా దారుణంగా నిరాశ పరిచింది. 2004 సంక్రాంతికి విడుదలైన అంజి ఐదేళ్ల పాటు సెట్స్ పై ఉంది. కర్ణుడి చావుకు లక్ష కారణాలు అన్నట్లు అంజి సినిమా ఫ్లాప్ కావడానికి కూడా చాలా కారణాలున్నాయి. ఎప్పుడో స్నేహం కోసం తర్వాత చిరంజీవి సైన్ చేసిన సినిమా ఐదేళ్లు షూటింగ్ జరుపుకొని చివరికి దారుణంగా డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా ఫ్లాప్ కావడానికి అసలు కారణాలు ఏంటి అనేది దివంగత కోడి రామకృష్ణ గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అంజి సినిమాకు ముందు చిరంజీవి వరస బ్లాక్ బస్టర్స్ ఇస్తున్నాడు.

ఇంద్ర, ఠాగూర్ ఇండస్ట్రీ రికార్డులతో చెడుగుడు ఆడుకున్నాయి. అలాంటి సందర్భంలో నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి.. చిరంజీవితో ఒక భారీ సినిమా చేయడానికి డేట్స్ తీసుకున్నాడు. దానికి కోడి రామకృష్ణను దర్శకుడిగా ఎంచుకున్నాడు. ఆయన అయితే చిరంజీవి లాంటి మాస్ హీరోతో గ్రాఫిక్స్ సినిమా వర్కవుట్ కాదని ముందుగానే కోడి రామకృష్ణ నిర్మాతలకు చెప్పాడు. కానీ ఆయన మాత్రం ఒప్పుకోలేదు. సరే చిరంజీవిని అడిగి కాన్సెప్ట్ మారుద్దామని దర్శకుడు ట్రై చేశాడు. అయితే అప్పటికి చిరంజీవి మనసులో కూడా ఒక భారీ గ్రాఫిక్స్ తో సినిమా చేయాలని ఉంది. దాంతో కోడి రామకృష్ణ ఇంకేం చేయలేకపోయాడు. చిరంజీవి ఇమేజ్ సరిపోయేలా అంజి సినిమా కథ సిద్ధం చేశాడు.

అంజి కథ సిద్ధమైన తర్వాత కూడా తన దగ్గర డ్యూయల్ రోల్ కథ ఒకటి ఉంది అది చేద్దాం అని చిరంజీవిని కోడి రామకృష్ణ అడిగాడు. కానీ అతడి మనసు మాత్రం గ్రాఫిక్స్ సినిమాపైనే ఉంది. అలా అంతా కలిసి అంజి సినిమా చేశారు. కానీ అనుకోకుండా ఈ సినిమా మూడు నాలుగేళ్లు షూటింగ్ జరుపుకుంది. ఇందులో క్లైమాక్స్ సన్నివేశం కోసం చిరంజీవి ఒకే షర్ట్ ఉతకకుండా రెండేళ్లు వేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు కోడి రామకృష్ణ. అంజి సినిమాలో చిరంజీవి చాలా మనసుపెట్టి చేశాడని.. ఒక కొత్త ఆర్టిస్టులా దీని కోసం కష్టపడ్డాడని చెప్పాడు ఈయన. ఫలితం ఎలా వచ్చినా కూడా తనకు చిరంజీవికి అంజి ఎప్పటికీ మరిచిపోలేని సినిమా అని ఓ ఇంటర్వ్యూలో దివంగత కోడి రామకృష్ణ తెలిపారు. కోడి చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే అంజి సినిమా ఫ్లాప్ కు చిరంజీవి కూడా ఒక కారణమే. 

More Related Stories