వర్మ మీద ప్రణయ్ తండ్రి ఎస్సీ, ఎస్టీ కేసు..వెనక్కు తగ్గుతాడా

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య ఉదంతాన్ని తెరకెక్కిస్తున్నట్లు వివాదాస్పద డైరెక్టర్ ఆర్జీవీ ప్రకటించారు. ఫాదర్స్‌డే సందర్భంగా ఫస్ట్‌లుక్.. టైటిల్‌ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రానికి 'మర్డర్' అనే టైటిల్ ఖరారు చేశారు ఆర్జీవీ. 'ఓ తండ్రి కుమార్తెను అతిగా ప్రేమిస్తే ఎంత ప్రమాదమో తెలిపే అమృత, మారుతీరావు కథతో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. శాడ్ ఫాదర్స్ ఫిల్మ్ పోస్టర్‌ను ఫాదర్స్ డే రోజున విడుదల చేస్తున్నా' అంటూ వర్మ ట్వీట్ చేశారు. ఇది చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో వర్మ మీద అమృత రాసినట్టుగా ఒక లెటర్ హల్చల్ చేసింది. అయితే ఈ విషయం మీద వర్మ స్పందిస్తూ తాను ఎందుకు సినిమా చేస్తున్నానో చెప్పుకొచ్చాడు కూడా. అయితే ఈ సినిమాని పగ నేపధ్యంలో తీయడం లేదని, ప్రేమ నేపధ్యంలో తీస్తున్నానని వర్మ చెప్పుకొచ్చారు. తనకు ఈ హత్య వ్యవహారం ముందుగా తెలీదని, మారుతి రావు ఆత్మహత్య అప్పుడే ఎవరో తనకు ఆయన సూసైడ్ నోట్ పంపారని దానిని చూసే సినిమా తీయాలని నిర్ణయించుకున్నానని వర్మ చెప్పుకొచ్చాడు.
అలాగే తాను అమృతను కలిసే ఉద్దేశం లేదని, దానికి సంబంధించిన info అంతా మీడియాలోనే దొరికేసిందని వర్మ చెప్పుకొచ్చాడు. అయితే ఈ సినిమాపై ప్రణయ్ తండ్రి బాలస్వామి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా వల్ల తన కొడుకు హత్య కేసు ప్రభావితమయ్యే అవకాశం ఉందంటూ.. నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టులో ఆయన ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎస్సీ ఎస్టీ కోర్టు.. రామ్ గోపాల్ వర్మ పై కేసు నమోదు చేయాలని మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులను ఆదేశించింది. దీంతో కోర్టు ఆదేశాలను అనుసరించి రామ్ గోపాల్ వర్మ మీద కేసు నమోదు చేసింది. అయితే వర్మకు ఇలాంటి కేసులు, నోటీసులు కొత్త కాదు కానీ ఇది ఎస్సీ, ఎస్టీ కేసు కాబట్టి కాస్త వెనకడుగు వేసే అవకాశం ఉంది. చూడాలి ఏమవుతోందో ?