మహేశ్ విజయ్ వంశీల క్రేజీ కాంబినేషన్

సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక వైపు హీరోగా నటిస్తూనే మరో పక్క తనకు నచ్చిన కధలను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆయనకు జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ కూడా ఉందన్న సంగతి తెలిసిందే. ఈ బ్యానర్ తో తాను నటిస్తున్న సినిమాల్లో ఒక వాటా పెడుతున్న ఆయన తొలిసారిగా అడివి శేష్ తో మేజర్ అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఇప్పుడు మహేష్ త్వరలో శర్వానంద్‌తో ఓ చిత్రాన్ని నిర్మించాలని భావిస్తున్నట్టు ఆ మధ్య ప్రచారం జరిగింది. ఈ మధ్య మహేష్ వద్దకి ఓ కథ వచ్చిందట, ఆ కధ విన్న ఆయన అది శర్వానంద్‌కి సరిగ్గా సరిపోతుందని భావించి ఆయన వద్దకు ఈ దర్శకుడిని పంపినట్టుగా చెబుతున్నారు.
ఈ ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో హిట్ కొట్టిన అయన ఇప్పుడు సర్కారు వారి పాట అనే చిత్రాన్ని చేయనున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే కొత్తగా ఇప్పుడు మహేష్ బ్యానర్ లో విజయ్ దేవరకొండ సినిమా చేస్తున్నాడని అంటున్నారు. అది కూడా మహర్షి డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ సినిమాకి డైరెక్టరని అంటున్నారు. మహేష్ తో సినిమా చేయల్సిన వంశీ పైడిపల్లి తన తరువాత సినిమాని మహేష్ తోనే చేయనున్నాడని అన్నారు. అయితే ఏమయిందో ఏమో ఇప్పుడు విజయ్ దేవరకొండతో సినిమా ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఆగాల్సిందే.