కరోనాతో టాలీవుడ్ హీరో తండ్రి మృతి

కరోనా ఎవరినీ వదలడం లేదు. మొదట్లో లాక్ డౌన్ విధించడంతో కాస్త కంట్రోల్ లోనే ఉన్న కరోనా లాక్ డౌన్ సడలించాక ఈ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో పోలిస్తే తెలంగాణాలో కాస్త ఎక్కువగా ఉన్న కరోనా, హైదరాబాద్ పరిధిలో ఇంకా ఎక్కువగా ఉంది. రోజు వేలల్లో కరోనా కేసులు హైదాబాద్ లో బయట పడుతున్నాయి. అనేక మంది ఈ మహమ్మారి బారినపడి మరణిస్తున్నారు. చిత్ర పరిశ్రమలో కొందరు కరోనా బారిన పడ్డారు. సీనియర్ నిర్మాత పోకూరి రామారావు కరోనా కారణంగా మరణించిన సంగతి తెలిసిందే.
తాజాగా చిత్ర పరిశ్రమకు చెందిన మరో హీరో తండ్రి కరోనాతో పోరాడి మరణించారు. మారుతీ దర్శకత్వంలో గతంలో వచ్చిన ఈరోజుల్లో చిత్ర హీరో శ్రీ తండ్రి మంగం వెంకట దుర్గా రామ్ ప్రసాద్ నిన్న కోవిడ్ తో మృతి చెందారన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత 20 రోజులుగా విజయవాడలోని ప్రముఖ హాస్పటల్లో చికిత్స పొందుతున్న ఆయన నిన్న రాత్రి ఎనిమిదిన్నరకు తుదిశ్వాస విడిచారని తెలుస్తోంది. శ్రీ అసలు పేరు శ్రీనివాస్, ఈరోజుల్లోతో ఎంట్రీ ఇచ్చిన ఆయన సాహసం శాయరా డింభకా, త్రివిక్రమన్ లాంటి సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం అయితే సినిమాలకి దూరంగానే ఉన్నాడు.