English   

కరోనా వైరస్‌తో ఈ దర్శకుల ఆశలు ఆవిరి అయిపోయాయిగా..

Corona virus
2020-07-13 12:48:29

కరోనా వైరస్‌తో ప్రపంచమే అతలాకుతలం అవుతుంది. ఇక ఆశలు ఎంత అంటారా..? అంతేలెండి.. నలుగురితో నారాయణ.. గుంపులో గోవిందా. ప్రస్తుతం పరిస్థితులు ఇలాగే ఉన్నాయి మరి. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ కూడా దీనికి మినహాయింపు కాదు. ఇక్కడ కూడా కొందరు దర్శకుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. ఈ దర్శకుల గత సినిమాలు నిరాశ పరిచాయి. దాంతో మరో సినిమా చేసి తమ సత్తా చూపించేద్దాం అని సిద్ధమవుతున్న సమయంలో కరోనా పంజా విసిరింది. దాంతో వీళ్ల ఆశలకు ప్రస్తుతానికి బ్రేకులు పడిపోయాయి. అలాంటి దర్శకులు తెలుగులో చాలా మంది ఉన్నారు. రామ్ చరణ్ ఇచ్చిన అవకాశాన్ని నిరాశ పరిచాడు బోయపాటి శ్రీను. వినయ విధేయ రామతో డిజాస్టర్ ఇచ్చాడు.. అందుకే బాలయ్యతో హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలనుకున్నాడు బోయపాటి. 

దసరాకు వచ్చేద్దామనుకుంటే కరోనా ఈయన జోరుకు బ్రేకులు వేసింది. ఇక బొమ్మరిల్లు భాస్కర్ అయితే బొమ్మరిల్లు తర్వాత బ్లాక్ బస్టర్ ఇవ్వలేదు. ఆయన్ని మరిచిపోయిన సమయంలో అఖిల్ హీరోగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా చేస్తున్నాడు భాస్కర్. ఈ చిత్రంతో వర్కవుట్ అవుతుందేమో అనుకుంటే సడన్‌గా కరోనా వచ్చింది. శ్రీకాంత్ అడ్డాల పరిస్థితి కూడా ఇంచుమించు ఇంతే. ఈయన కూడా సీతమ్మ వాకిట్లో తర్వాత చేసిన ముకుందా పర్లేదనిపిస్తే.. బ్రహ్మోత్సవం ఈయన కెరీర్ పై దారుణమైన దెబ్బేసింది. ఇలాంటి తరుణంలో నారప్పతో వస్తున్నాడు శ్రీకాంత్. కానీ అసురన్ రీమేక్ పై.. శ్రీకాంత్ అడ్డాల ఆశలపై నీళ్లు చల్లేసింది కరోనా. మిస్టర్ మజ్ను సినిమాతో ఫ్లాప్ ఇచ్చిన వెంకీ అట్లూరీ కూడా రంగ్ దే సినిమాతో సత్తా చూపించుకుందామనుకుంటే కరోనా వచ్చి అన్నీ పాడు చేసింది. 

ఆర్ఎక్స్ 100తో సంచలనం సృష్టించినా కూడా అజయ్ భూపతికి మరో ఆఫర్ రాలేదు. ఇప్పుడు మహాసముద్రంతో ఏదో చేద్దామనుకుంటుంటే కరోనా అలల తాకిడికి తట్టుకోలేకపోతున్నాడు అజయ్ భూపతి. సవ్యసాచి ఫ్లాప్ తర్వాత కార్తికేయ 2తో బిజీగా ఉన్నాడు చందూ మొండేటి. కానీ ఈ చిత్ర షూటింగ్ కూడా కరోనాకు బలైపోయింది. దాంతో ఈ దర్శకుడి ఆశలు కూడా గల్లంతయిపోయాయి. వీళ్లేకాదు పుష్కరం కింద హిట్ ఇచ్చిన కృష్ణవంశీ.. సరైన హిట్ కోసం చూస్తున్న వంశీ పైడిపల్లి ఇలాంటి దర్శకులంతా లాక్ డౌన్ కారణంగా పాపం ఎటూ కాకుండా పోయారు.

More Related Stories