English   

సాయి పల్లవి లవ్ స్టోరీ కోసం కొరియోగ్రఫర్ అవుతుందోచ్..

Sai Pallavi
2020-07-15 17:09:17

సాయి పల్లవి అంటే నటి మాత్రమే కాదు డాన్సర్ కూడా గుర్తొస్తుంది. ఢీ షోతో పదేళ్ల కిందే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది సాయి పల్లవి. అప్పట్లో ఆమె విన్నర్ కూడా.. దాంతో పాటు ఆమెపైనే స్పెషల్ ప్రోమోలు కూడా చేసారు ఈటీవీ. ఢీ తర్వాత ఎంబిబిఎస్ కోసం విదేశాలు వెళ్లింది సాయి పల్లవి. తిరిగొచ్చిన తర్వాత ప్రేమమ్ సినిమాతో స్టార్ అయిపోయింది. అందులో మలర్ పాత్రలో కుర్రాళ్ల మతులు చెడగొట్టేసింది సాయి పల్లవి. వెంటనే తెలుగులో ఫిదా సినిమాతో సెన్సేషనల్ స్టార్ అయిపోయింది. ఇక నాని ఎంసిఏ సినిమాతో టాప్ రేంజ్ కు వెళ్లిపోయింది. ఆ తర్వాత వచ్చిన పడిపడి లేచే మనసు, కణం లాంటి సినిమాలు ఫ్లాప్ అయినా కూడా సాయి పల్లవి కెరీర్ మాత్రం ప్రస్తుతం టాప్ స్పీడ్ లోనే ఉంది. ప్రతీ సినిమాలో కూడా డాన్స్ కు కూడా ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటుంది సాయి పల్లవి. 

ఇదిలా ఉంటే ప్రస్తుతం లవ్ స్టోరీ, విరాట పర్వం సినిమాలతో బిజీగా ఉంది సాయి పల్లవి. విరాట పర్వంలో నక్సలైట్ గా నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇక శేఖర్ కమ్ముల లవ్ స్టోరీలో పక్కింటి అమ్మాయి తరహా పాత్రలో మెప్పించడానికి రెడీ అయిపోయింది. ఈ సినిమా షూటింగ్ వారం రోజులు మినహా అంతా పూర్తయింది. ఒక్క పాట చిత్రీకరణ మాత్రం అలాగే ఉండిపోయింది. ఈ ఒక్క పాట కోసం ప్రత్యేకంగా కొరియోగ్రఫర్ ఎందుకని సాయి పల్లవినే కొరియోగ్రఫీ చేసుకోమ్మని శేఖర్ కమ్ముల కోరినట్లు తెలుస్తుంది. దానికి ఆమె కూడా చాలా హ్యాపీగా ఒప్పుకుని పాటను కంపోజ్ చేసుకుందని ప్రచారం జరుగుతుంది. ఎప్పట్నుంచో కొరియోగ్రఫర్ గా సత్తా చూపించాలని ఉవ్విళ్లూరుతుంది సాయి పల్లవి. ఇప్పుడు అది నిజమయ్యేలా కనిపిస్తుంది. లవ్ స్టోరీ సినిమా కోసం తన టాలెంట్ చూపించే పనిలో పడింది ఈ ఫిదా బ్యూటీ. మరి చూడాలిక.. సాయి పల్లవి సొంత స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయో..? 

More Related Stories